
Smart Phone Addiction: ఒకప్పుడు పిల్లలకు టైం దొరికితే గ్రౌండ్‌కు పరిగెత్తే వారు. కానీ ఆటమైదానాలు మాయమవటంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
దీంతో పిల్లలు టైం అంతా మొబైల్ ఫోన్ చూడటంలోనే గడిపేస్తున్నారు. ఆటలూ, పాటలూ, చదువూ అన్నీ.. అందులోనే.
కాసేపు ఫోన్ ఇస్తే నష్టమేంటిలే? అనే ధోరణిలో చాలమంది పెద్దలు పిల్లలకు ఫోన్ ఇచ్చేస్తున్నారు.
అయితే.. దీనివల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం కోలుకోలేని రీతిలో దెబ్బతింటోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజుకు 5 గంటలకు మించి స్మార్ట్‌ఫోన్ వాడే పిల్లల్లో మానసిక సామర్థ్యం, చదువు మీద ఆసక్తి తగ్గుతోందని వైద్యులు గణాంకాలతో రుజువుచేస్తున్నారు.
మొబైల్ వాడకం మితిమీరితే.. పిల్లల కంటి చూపు దెబ్బతినటమే గాక.. చిన్నవయసులో కళ్లద్దాలు వాడాల్సి వస్తోంది.
ఫోన్‌కు అడిక్ట్ అయిన పిల్లల్లో ఏకాగ్రత, చురుకుదనం, జ్ఞాపకశక్తి తగ్గిపోవటంతో బాటు నిద్రలేమి, బద్ధకం, వెన్నునొప్పి వంటి సమస్యలూ మొదలవుతున్నాయి. అందుకే.. పిల్లలను మొబైల్ వ్యసనం నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులే చొరవ చూపాలని మానసిక వేత్తలు సలహా ఇస్తున్నారు.

రోజులో కొంత సమయం ఖచ్చింతంగా పేరెంట్స్.. పిల్లలతో గడిపాలని వారు చెబుతున్నారు.
అలాగే.. పెద్దలు రోజంతా ఫోన్ పట్టుకుని కూర్చుని.. పిల్లలను మాత్రం వద్దని చెబితే ప్రయోజనం ఉండదనేది వారి మాట.
పిల్లలు ఆడుకునేందుకు వారికి ఇష్టమైన బొమ్మలు, క్రాఫ్ట్ లాంటివి అందించటం, చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
రోజూ స్కూల్ విషయాలు అడిగి తెలుసుకోవటం, రోజుకో కథ చెప్పటం వంటివి పిల్లలను మొబైల్ వ్యసనం నుంచి దూరం చేస్తాయి.
పిల్లలను రోజూ వాకింగ్‌కు తీసుకెళ్లి, అక్కడ కాసేపు ఆడించే ఏర్పాటు చేయాలి.
పిల్లలకు మ్యూజిక్, డాన్స్, డ్రాయింగ్, సోషల్ వర్క్ వంటి వాటిలో బిజీగా ఉంచేలా చేస్తే.. మొబైల్ వ్యసనం ఆటోమేటిక్‌గా దూరమమవుతుంది.