
Restaurant Food : ఈరోజుల్లో చాలావరకు ఆరోగ్య సమస్యలకు మనం తినే ఆహారమే చాలావరకు కారణమవుతుంది. ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యం బారిన పడాలన్నా మనం తినే ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఎన్నో ఏళ్లుగా ప్రాణాంతక వ్యాధిగా పరిగణించబడుతున్న క్యాన్సర్‌కు కూడా ఆహార పదార్థాలే ఏదో విధంగా కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. అందుకే వారు ఒక వినూత్నమైన ఐడియాతో ముందుకొచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో క్యాన్సర్ మరణాలను కేవలం రెస్టారెంట్లలోనే మెనూలలో క్యాలరీల సమాచారంతో చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే అని టఫ్ట్స్ యూనివర్సిటీ ఫ్రైడ్‌మ్యాన్ స్కూల్ ఆఫ్ న్యూట్రీషన్ సైన్స్ అండ్ పాలిసీ వారు చేసిన స్టడీలో తేలింది. దీనిని పరిగణనలోకి తీసుకొని 2018లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఒక కొత్త రూల్‌ను ఆచరణలోకి తెచ్చింది.
20 కంటే ఎక్కువ బ్రాంచులు ఉన్న రెస్టారెంట్లు మెనూలో ఏ ఆహారానికి ఎంత క్యాలరీ అని లేబుల్స్‌ను కస్టమర్లకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. అఫార్డబుల్ కేర్ యాక్ట్ ప్రకారం అందరూ ఈ రూల్‌ను తప్పకుండా పాటించాలని తెలిపింది. తరువాత కొన్ని రెస్టారెంట్లు దీనిని ఆచరణలోకి తీసుకొచ్చాయి కూడా. దీని వల్ల ప్రజలు పొందుతున్న లాభాలు ఏంటని శాస్త్రవేత్తలు సర్వేలు చేసి తెలుసుకున్నారు.
మెనూలో క్యాలరీల కూడా సమాచారం అందించడం వల్ల కనీసం ఒక్క కస్టమర్ అయినా తను రోజూ తినే ఆహారంలో 20 నుండి 60 క్యాలరీలు తగ్గించుకున్నాడని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న 28 వేలకు పైగా క్యాన్సర్ కేసులు ఒబిసిటీ వల్లే సంభవిస్తున్నాయని, అందులో 16,700 మృత్యువాత పడక తప్పడం లేదని వారు తేల్చారు. అందుకే వారు తినే ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో తెలుసుకోవడం వల్ల అది ఒబిసిటీకి కారణమవుతుందా, ఆ తర్వాత అది క్యాన్సర్‌కు దారితీస్తుందా అని తెలుసుకునే అవకాశం ఉందని వారు తెలిపారు.
మనం ఆహారం విషయంలో చేసుకునే చిన్న చిన్న మార్పులు ఎంత పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తాయి అనే విషయాన్ని అందరికీ తెలియజేయడమే తమ ముఖ్య లక్ష్యమని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అందుకే ఈ ప్రక్రియ ద్వారా రెస్టారెంటుకు వెళ్లి మెనూ చూసినప్పుడు తాము తినాలనుకునే ఆహారం ఎక్కువ క్యాలరీలు కలిగి ఉన్నది అయితే దానికి ప్రత్యామ్నాయంగా మరో ఐటెమ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కస్టమర్లకు లభిస్తుంది. దీని వల్ల ఒబిసిటీ రిస్క్ కూడా చాలావరకు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.