
Dengue : ఏటా 10-40 కోట్ల మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. ఏడిస్ అనే ఒక రకమైన దోమలతో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ డెంగ్యూ. సరైన చికిత్స తీసుకోకుంటే డెంగ్యూ వైరస్ వల్ల మరణం సంభవిస్తుంది. ఇప్పటికే ఏటా 20 వేల మంది వరకు మృత్యువాత పడుతున్నారు.
డెంగ్యూ ఓ సాధారణ జ్వరంలా రావచ్చు. లేదా తీవ్ర రక్తస్రావమై ప్రాణాంతకం కావచ్చు. ఇలాంటి వ్యాధిని సమర్థంగా నిరోధించగల విరుగుడును పరిశోధకులు కనిపెట్టేశారు. అదీ అందుబాటులో ఉండే ఆహార పదార్థాల నుంచే లభ్యం కావడం విశేషం.
అలహాబాద్ యూనివర్సిటీకి చెందిన అమిత్ దూబే, మలేసియా ప్రొఫెసర్ అలూవి సంయుక్త పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. డెంగ్యూను సినాపిక్ యాసిడ్ సమర్థంగా అడ్డుకోగలదని రిసెర్చర్లు తెలిపారు. మసాలా దినుసులు, సిట్రస్ ఫ్రూట్స్, కూరగాయలు, తృణధాన్యాలు, గ్రీన్-డ్రై ఆలివ్ ఆయిల్స్‌లో ఈ కాంపౌండ్ సమృద్ధిగా ఉంటుంది.
డెంగ్యూవైరస్‌ను కలగజేసే ప్రొటీన్లను సినాపిక్ యాసిడ్ అడ్డుకుంటుందని ఆ పరిశోధనలో తేలింది. శరీరంలో ఎంజైములను సినాపిక్ యాసిడ్ క్రియాత్మకం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో దీని వల్ల కలిగే కీడు కూడా తక్కువేనని తేలిందన్నారు.
డెంగ్యూ చికిత్సలో సినాపిక్ యాసిడ్ కీలక భూమిక పోషిస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ పరిశోధన ఫలితాలు ‘యాస్పెక్ట్స్ ఆఫ్ మాలుక్యులర్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి.