
Benefits of walking barefoot : ఇంట్లో నుంచి కాలు బయటపెడితే చాలు.. కాలికి చెప్పులు తొడిగేస్తాం. అలాగే.. పిల్లలు ఆడుకోవడానికి వెళ్తున్నా చెప్పులు లేకుండా పంపించం. కొందరైతే.. ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరుగుతుంటారు. మొత్తంగా.. పాదరక్షలు మన రోజువారీ జీవితంలో ఓ భాగమయిపోయాయి. కానీ, మన పూర్వీకులు ఇంతగా పాదరక్షలకు ప్రాధాన్యం ఇచ్చింది లేకున్నా.. వారంతా ఏ అనారోగ్యాల బారిన పడకుండా హాయిగా బతికారు. ఇదే మాట ఇప్పుడు మన వైద్యనిపుణులూ చెబుతున్నారు. రోజులో కనీసం ఓ గంటపాటు చెప్పులు లేకుండా నడిస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రయోజనాలు:
చెప్పులు లేకుండా నడిస్తే.. శరీర బరువంతా పాదం మీద సమానంగా పడుతుంది. దీనివల్ల నడిచేటప్పుడు శరీర భంగిమలో తేడా రాదు.
చెప్పులు లేకుండా నడిచే క్రమంలో మనం మరింత జాగరూకతతో ఉంటాము. మనిషికి సహనం కూడా పెరుగుతుంది.
మన శరీరంలోని నాడుల కొనలన్నీ.. పాదంలో ఉంటాయి. ఒట్టికాళ్లతో నడిస్తే.. ఈ నాడుల కొనలన్నీ చైతన్యం పొంది.. చురుగ్గా పనిచేస్తాయి.
గుండు కొట్టుకునే వేగం, రక్తంలోని చక్కెర స్థాయిలు, మెదడులోని నాడీకణాల పనితీరు మెరుగుపడతాయి. నిద్ర కూడా బాగా పడుతుంది.
చెప్పులు లేకుండా నడిస్తే.. పాదం పూర్తిగా భూమికి తాకి.. భూమి అయస్కాంత శక్తి ప్రభావం శరీరం మీద పడి, ఆందోళన & డిప్రెషన్ తగ్గుతాయి.
శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటంతో బాటు రక్తం పలుచబడి.. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
శరీర కదలికల్లో బ్యాలెన్స్ పెరుగటంతో బాటు మోకాలి కింది భాగపు కండరాలు బలపడతాయి.
హైహీల్స్ ధరించే వారికి వెన్నుమీద పడే ఒత్తిడి దూరమవుతుంది.
గట్టిగా ఉండే ఉపరితలం కంటే.. పచ్చని గడ్డి లేదా సముద్రతీరంలోని మెత్తని ఇసుకపై నడిస్తే.. మరింత మెరుగైన ఫలితాలుంటాయి.
ప్రారంభంలో ఇలా నడవటం కాస్త కష్టంగా అనిపించినా.. రోజూ నడుస్తూ ఉంటే.. కొన్నాళ్లకు అలవాటవుతుంది.