Diabetes and Sleep: డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు దాన్ని అదుపులో పెట్టాలనుకుంటే ప్రతిరోజు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. వాకింగ్ అద్భుతమైన ఔషధం. మధుమేహంతో బాధపడే వారంతా వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు అరగంట పాటు వాకింగ్ చేయండి చాలు, మధుమేహం కచ్చితంగా అదుపులోకి వస్తుంది. దీని వల్ల వారికి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి.
రాత్రి నిద్రపోవడానికి ముందు వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మానసిక ఒత్తిడి చాలా తగ్గుతుందని, ఇది ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఇలా వాకింగ్, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల వారికి నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా ఉంటాయని, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయని తెలిసింది.
రాత్రి భోజనం చేశాక నిద్రపోయే ముందు అరగంట పాటు వాకింగ్ చేయడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. దీనివల్ల క్యాలెరీల బర్న్ కూడా పెరుగుతుంది. అధిక బరువు పెరగకుండా ఉంటారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. అర్ధరాత్రి కొంతమందికి ఏదైనా ఆహారం తినాలన్న కోరిక పుడుతుంది. వీటిని మిడ్ నైట్ క్రేవింగ్స్ అంటారు. ఇవి పుట్టకుండా ఉండాలన్నా కూడా రాత్రి నిద్రపోయే ముందు అరగంట పాటు నడవడం చాలా ముఖ్యం.
రాత్రిపూట ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల శరీరానికి రిలాక్స్ గా అనిపిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యం పై ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఆందోళన, డిప్రెషన్ వంటి లక్షణాలను తగ్గిస్తుంది. రాత్రిపూట నడవడం అనేది ప్రతికూల ఆలోచనలను దూరం పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. మానసిక స్పష్టత పెరుగుతుంది. ఆలోచనలు జోరుగా రావడం అదుపులో ఉంటుంది.
Also Read: తేనె తింటే మంచిదే, కానీ దానిలో ఈ పదార్థాలు కలుపుకొని తింటే మాత్రం ప్రమాదం
పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణక్రియ సవ్యంగా సాగాలి. చాలామందికి రాత్రి భోజనం తర్వాత కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీనివల్ల నిద్రలేమి సమస్య కూడా వస్తుంది. నిద్ర సరిగా పట్టక మరుసటి రోజు ఏ పనీ చేయలేరు. అందుకే ఈ సమస్యలతో బాధపడే వారంతా రాత్రి నిద్రపోయే ముందే వాకింగ్ చేయడం ఉత్తమం. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో సహాయపడుతుంది. వికారం, వాంతులు వంటి లక్షణాలు రాకుండా అడ్డుకుంటుంది.
ముఖ్యంగా రాత్రిపూట తేలికపాటి ఆహారాన్ని తినడం కూడా అలవాటు చేసుకోవాలి. స్పైసీగా ఉండే మసాలాలు దట్టించిన ఆహారాన్ని రాత్రిపూట తింటే ఆ రాత్రి నిద్ర పట్టడం చాలా కష్టం. జీర్ణవ్యవస్థలో ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటివారు కచ్చితంగా గంట పాటు వాకింగ్ చేశాకే నిద్రపోవాలి. మీరు తేలికపాటి ఆహారం తింటే అరగంట పాటు వాకింగ్ చేస్తే సరిపోతుంది. కానీ భారీ భోజనాలు చేసే వారు మాత్రం గంట పాటు వాకింగ్ చేశాకే నిద్రపోవడం అన్నిటికన్నా ఉత్తమమైన పద్ధతి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.