
Aditya L1 mission launch live(Today’s breaking news in India):
ఇస్రో సరికొత్త చరిత్ర. సూర్యుడి దిశగా ఆదిత్య. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిసింది PSLV-C57. అద్భుతం సృష్టించేందుకు ఆదిత్య L1 ను దూసుకెళుతోంది. భానుడి భగభగల వెనుక దాగున్న విషయాలను తేల్చేందుకు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించింది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సరిగ్గా షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు PSLV-C57 రాకెట్ ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంతో రోదసిలోకి దూసుకెళ్లింది. 125 రోజుల పాటు ప్రయాణించి నిర్దేశిత స్థానానికి చేరుకుంటుంది.
సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేడుతున్న తొలి మిషన్ ఇది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సూర్యుడి వాతారణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రయోగ ఉద్దేశం.
ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని మొదట జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ పాయింట్-1లోకి పంపుతారు. యూరోపియస్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ర్టేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై ఇస్రో అధ్యయనాలను చేపడుతోంది.
ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం బరువు 15 వందల కిలోలు. దీనిలో మొత్తం 7 పేలోడ్లను పంపింది. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ తో పాటు సోలార్ అల్ర్టావయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ఫ్లాస్మా అనలైజేషన్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ర్టోమీటర్, మాగ్నెటోమీటర్‌లు ఉన్నాయి.
సూర్యుడి నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. సూర్యుడికి సంబంధించి రోజుకు 14 వందల ఫొటోలు తీసి విశ్లేషణ కోసం ఇస్రోకు పంపనుంది ఈ శాటిలైట్. కనీసం ఐదేళ్ల పాటు ఫొటోలు వస్తాయని ఇస్రో అంచనా వస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్య నుంచి ఈ పేలోడ్ పనిచేయడం ప్రారంభమవుతుందని అంచనా.
చంద్రుడిని అందుకున్నామని, ఇక సూర్యుడిని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా ఆదిత్య ప్రయోగం చేపట్టామని.. ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. అక్టోబరు రెండో వారంలో గగన్‌యాన్, అనంతరం SSKV-D3, GSLV-మార్క్ 3 వరుస ప్రయోగాలు ఉంటాయని వివరించారు.