
Ayodhya Issue Full Details : అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి కేసులో సర్వోన్నత న్యాయస్థానం తన తుదితీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ తీర్పును ఇచ్చే క్రమంలో న్యాయస్థానం పురావస్తు శాఖ నివేదికను ప్రమాణంగా తీసుకుంది. ధార్మిక విశ్వాసాలు, లెక్కకుమించిన ఏ ఆధారం లేని గాథలు, చరిత్ర, సైన్స్ నిలబెట్టిన ఆధారాలకు మధ్య జరిగిన సుదీర్ఘపోరాటంలో సైన్స్ నిలబెట్టిన ఆధారాలే చివరికి కీలకంగా నిలిచాయి. విశ్వాసాలు, నమ్మకాలు ఆధారంగా కాకుండా సాక్ష్యాల ప్రాతిపదికపైన మాత్రమే కేసును పరిష్కరించినట్టు సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
ఇదీ చరిత్ర:
మొదటి పానిపట్టు యుద్ధంలో ఏప్రిల్ 21, 1526 న మొఘలుల నాయకుడైన బాబర్ కూ, అప్పటి కాబూల్ పరిపాలకుడైన సుల్తాన్ ఇబ్రాహీం లోడీకి మధ్య జరిగింది. సుల్తాన్ సైన్యం మొఘలాయిల సైన్యం కన్నా చాలా పెద్దది. కానీ అందరూ ఒక్కసారిగా పాల్గొనకుండా విడివిడిగా పాల్గొన్నారు. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ మరణించాడు. ఆ క్రమంలోనే బాబర్ అయోధ్యను సందర్శించాడు. అయితే.. బాబర్ విజయానికి గుర్తుగా ఇక్కడి మందిరాన్ని కూల్చి మసీదు నిర్మించారని కొందరు, అసలు అక్కడ రామ మందిరం ఉన్న విషయం బాబర్‌కు తెలియదని, బాబర్ వద్ద సైన్యాధిపతిగా ఉన్న మీర్ బక్షీ తాష్కండి మసీదు నిర్మించాడని మరికొందరి వాదన. కాదు.. బాబరు ఆదేశం మేరకే ఆయన సేనాని ఈ నిర్మాణంచేశారన్నది మరో వాదన.
తవ్వకాల చరిత్ర:
అయోధ్యలోని వివాదాస్పద స్థలం కోసం మొదలైన న్యాయపోరాటంలో భాగంగా 1976-77లో ఒకసారి, 2003లో అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం ఆదేశంతో అదే ఏడాది మార్చి 12 నుండి ఆగస్టు 7వ తేదీ వరకూ బీఆర్ మణి ఆధ్వర్యంలో బృందం భూగర్భంలోకి చొచ్చుకెళ్లే రాడార్ సాయంతో తవ్వకాలు నిర్వహించి ఆ కమిటీ 574 పేజీల నివేదికను ఇచ్చింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కోర్టుకు ఇచ్చిన ఆ నివేదికలోని అంశాలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రాతిపదికగా నిలిచాయి. అంతేకాకుండా.. విచారణలో భాగంగా న్యాయస్థానం పలువురు నిపుణుల అభిప్రాయాలనూ ప్రమాణంగా తీసుకుంది.
కీలక సాక్ష్యాలు :
- బాబ్రీ మసీదు గోడల్లో ఆలయ స్థంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలను బ్లాక్ బసాల్ట్ అనే రాయితో నిర్మించారు. ఈ స్తంభాల కింది భాగంలో 11-12 శతాబ్దాల్లో అమల్లో ఉన్న సంప్రదాయాల ప్రకారం పూర్ణ కలశాలు చెక్కి ఉన్నాయి. ఆలయంలో కనిపించే పూర్ణ కలశం.. సౌభాగ్యానికి సంకేతమైన ఎనిమిది మంగళ చిహ్నాల్లో ఒకటి. 1992లో మసీదును కూల్చేసిన నాటి వరకు, ఒకటో రెండో కాదు, అటువంటి స్తంభాలు 14 అక్కడ ఉన్నాయి.
- అయోధ్యలో కూల్చివేత సమయంలో బయటకి వచ్చిన అత్యంత ముఖ్యమైన కళాకృతి ‘విష్ణు హరి శిల’ అనే ఒక శిలా శాసనం. ఆ శాసనం మీద 11-12 శతాబ్దాల నాటి నాగరి లిపిలో సంస్కృత భాషలో ఈ ఆలయం బలి చక్రవర్తిని, దశకంఠ రావణుడిని హతమార్చిన విష్ణుమూర్తికి (శ్రీరాముడు విష్ణు అవతారం) ఆలవాలమని ఉంది.
- 2003లో అలహాబాద్ హైకోర్ట్ ఆదేశాల మేరకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన తవ్వకాల్లో ఈ మసీదు క్రింద 10వ శతాబ్దంనాటి దేవాలయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపింది. ఆలయ స్తంభాలకు నాడు ఆధారంగా ఉన్న యాభైకి పైగా ఇటుక పునాదులను కనుగొన్నారు. ఆలయం పైన ఉండే అమలకం, అభిషేక జాలం ప్రవహించే మకర ప్రణాళి నిర్మాణాన్ని కూడా తవ్వి తీశారు.
- 1992లో, డాక్టర్ Y D శర్మ, డాక్టర్ K M శ్రీవాస్తవ ఆ స్థలాన్ని పరిశీలించినప్పుడు క్రీస్తు శకం 100 నుంచి 300 మధ్యకాలం నాటి మహావిష్ణు అవతారాలు, శివుడు, పార్వతి మొదలైన దేవతల మట్టి విగ్రహాలు చిన్నవి లభ్యమయ్యాయి. ఇవి కుశన కాలానికి చెందినవని నిర్ధారించారు.
- మసీదు కింద 8-10 వ శతాబ్దాల నాటి వలయాకార ఆలయ ఆనవాళ్లున్నాయని, అవేవీ ఇస్లాంకు సంబంధించినవి కావని కూడా పురావస్తు నివేదిక స్పష్టం చేసింది.
- మందిరం కూల్చివేత బాబర్ పనేనని ఆధారాలు లేకుండా చేయకూడదనే బాబర్ ఆత్మకథ మూలప్రతి అయిన బాబరునామాలో 1528 ఏప్రిల్ 2 నుండి 1528 సెప్టెంబర్ 8వ తేదీల మధ్య జరిగిన ఘటనల వివరాలు లేకుండా ఆ పేజీలను మాయం చేయటమూ అనుమానాలకు తావిచ్చింది.
- అలాగే.. బాబ్రీ మసీదు ఎదుట ప్రాంగణాన్ని చదును చేసినప్పుడు, 263 ఆలయ సంబంధ అవశేషాలు, కళాకృతులు లభ్యమయ్యాయని ఉత్తర్ ప్రదేశ్ పురావస్తు సంచాలకులు డాక్టర్ రాగేష్ తివారి ఒక నివేదికలోని అంశాలనూ కోర్టు పరిశీలించింది.
- తవ్వకాలు నిష్పక్షపాతంగా జరిగాయని చెప్పేందుకు 131 మంది తవ్వకం సిబ్బందిలో 52 మంది ముస్లింలను చేర్చారు. అంతే కాదు. తవ్వకాలను, బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ ప్రతినిధులు, పురావస్తు చరిత్రకారులైన సూరజ్ భాన్, మండల్, సుప్రియ వర్మ, జయ మీనన్ సమక్షంలో జరిపారు.
- మసీదుగా చెబుతున్న వివాదాస్పద స్థలంలో 1528 నుంచి 1856 మధ్య(328 ఏళ్లు) నమాజు జరిగినట్లు ఏ ఆధారాలు లేవని తేలింది.
- పురావస్తు శాస్త్రం, క్షేత్ర పురావస్తు శాస్త్రం పట్ల మధ్య తేడాను పురావస్తు శాఖ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. పురావస్తు శాఖ తరపున డాక్టర్ బీఆర్ మణి వంటి విశిష్ట పురావస్తు శాస్త్రజ్ఞుల వివరణల ముందు.. బాబ్రీ కమిటీ ప్రతినిధులుగా పాల్గొన్న జే.ఎన్.యు, అలీగఢ్ విశ్వవిద్యాలయాల పురావస్తు నిపుణుల వాదన నిలవలేకపోయింది.
అంతిమంగా.. ఈ స్థలమంతా హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితోపాటు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, డీవై చంద్రఛూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు.