
Congress party news today(Latest political news in India): ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గెలుపు ఎవరిది? అంటే కాంగ్రెస్ దే అధికారమని చెబుతున్నాయ్ మెజార్టీ సర్వేలు. వరుసగా రెండోసారి అధికారం చేపడుతుందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో తేలింది. జూన్ లో నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 53 నుంచి 60, బీజేపీకి 20 నుంచి 27 స్థానాలు, బీఎస్పీ,ఇండిపెండెంట్, ఇతర ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్క స్థానం గెలిచే అవకాశముందని.. సర్వేలో వెల్లడైంది.
ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి కావాల్సినవి 46 స్థానాలు. అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ మార్కును కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా పొందే అవకాశం ఉన్నట్టు పీపుల్స్‌పల్స్ సంస్థ చేపట్టిన సర్వేలో ఓటర్లు తమ అభిప్రాయాన్ని చెప్పారు.
2018 ఎన్నికల్లో 43.03 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్ 2.96 శాతం అధిక ఓట్లతో 46 శాతం ఓట్లు పొందనుందని సర్వేలో తేలింది. 2018 ఎన్నికల్లో 33 శాతం ఓట్లు పొందిన బీజేపీ 5 శాతం అధిక ఓట్లతో 38 శాతం ఓట్లు పొందనుందని సర్వేలో తేలింది. 2018లో కాంగ్రెస్ కంటే బీజేపీకి 10 శాతం ఓట్లు తక్కువ రాగా ఇప్పుడు రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 8 శాతం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 లోక్‌సభ స్థానాల్లో 10 స్థానాలు గెల్చుకున్న బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకంజలో ఉందని సర్వేలో వెల్లడయ్యింది. కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగడానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉండడమే.
బీజేపీ జాతీయత, హిందుత్వ అంశాలకు ప్రత్యామ్నాయంగా సీఎం భూపేష్ ఛత్తీస్‌గఢ్ ఆత్మ గౌరవం అంశంలో భాగంగా ఛత్తీస్‌గఢ్ మాతారి, గదో నవా ఛత్తీస్‌గఢ్ వంటి నినాదాలకు ప్రజలు ఆకర్షితులయ్యినట్లు పీపుల్‌పల్స్ సర్వేలో వెల్లడయ్యింది. ప్రభుత్వం స్థానిక పండుగలకు గుర్తింపు ఇచ్చి సెలవులు ప్రకటించడం, ఛత్తీస్‌గఢ్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడం, రాష్ట్ర గీతం అర్ప`పైరి కి ధర్ ప్రవేశపెట్టడం వంటి సెంటిమెంట్ అంశాలు కాంగ్రెస్ విజయానికి తోడ్పడుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి ఏ పార్టీ కృషి చేస్తుందని ఓటర్లను పీపుల్స్ పల్స్ అడగగా కాంగ్రెస్ 48, బీజేపీ 40 శాతం, జేసీసీ ఒక శాతం, బీఎస్పీ ఒక శాతం. కాంగ్రెస్‌కు మరోసారి అవకాశమిస్తారా అని సర్వేలో ఓటర్లను అడగగా అవకాశం ఇస్తామని 47శాతం ప్రజలు చెప్పుకొచ్చారు. బీజేపీకి మూడు మార్లు అవకాశమిచ్చినట్టే కాంగ్రెస్‌కు కూడా మరోసారి అవకాశమిద్దామనే నిర్ణయంతో ఉన్నారు ఓటర్లు.
పీపుల్స్‌పల్ సంస్థ 2023 జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు మొత్తం 30 రోజులపాటు రాష్ట్రంలో సర్వే నిర్వహించింది. సంస్థ తరఫున రీసెర్చ్ స్కాలర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలలో మొత్తం 5 వేల కిలోమీటర్లు పర్యటించింది. ప్రతి బృందంలో ఐదుగురు రీసెర్చర్లు, 20 మంది రీసర్చ్ స్కాలర్స్ ఉండేలా మొత్తం నాలుగు బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేపట్టారు. ఈ నాలుగు బృందాలలో మూడు బృందాలు రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలలో పర్యటించగా, మరో బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 35,`40 సాంపిల్స్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3000 సాంపిల్స్‌లను సేకరించింది. కులం, ప్రాంతం, స్త్రీలు, పురుషులు, అన్ని వయసుల వారికి సమప్రాధాన్యతిస్తూ ఈ సర్వే చేపట్టారు.