
Majuli Island : పూర్వం నరకాసురుడి రాజధానిగా వెలుగొందిన ప్రాగ్జోతిషపురం పేరుతోనే నేటి అసోం ప్రభుత్వం ప్రస్తుత రాజధాని అయిన గువాహటికి సమీపంలో మరో నగరాన్ని నిర్మిస్తోంది. అయితే.. ఈ అసోం రాష్ట్రంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓ పర్యాటక ప్రదేశం ఉంది. అదే.. మజులి ద్వీపం. అసోం గర్భంలో దాగిన అద్భుత మణిగా ఈ ద్వీపానికి గుర్తింపు ఉంది. ఎన్నో విశేషాలకు నెలవైన ఆ ద్వీపం విశేషాలు మీకోసం..
ద్వీపం అనగానే ఎవరికైనా సముద్రం మధ్యలో ఉన్న భూభాగమనే అనుకుంటారు. అయితే నదీ ప్రవాహ క్రమంలోనూ ద్వీపాలు ఏర్పడతాయి.
బ్రహ్మపుత్ర నది గర్భాన ఉన్న అలాంటి అరుదైన ద్వీపమే ఈ మజులి ద్వీపం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన మంచినీటి ద్వీపాల్లో ఇదే పెద్ద ద్వీపం కావడం విశేషం.
గతంలో ఈ ద్వీపం 1250 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉండగా, నదీకోత కారణంగా ప్రస్తుతం 421.65 చదరపు కి.మీలకు పరిమితమైంది. జోర్హాట్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపానికి ఫెర్రీలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ద్వీపంలో లక్షా 90 వేల మంది నివాసముంటున్నారు.
ఇది ఒక అసెంబ్లీ నియోజకవర్గం కూడా. దీనిని గిరిజనులకు కేటాయించారు. గతంలో జోర్హాట్ జిల్లాలో భాగంగా ఉన్న మజులి.. 2016లో జిల్లాగానూ మారింది. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ద్వీపమే ప్రస్తుతం అసోంలో అత్యంత పేరున్న పర్యాటక స్థలంగా ఉంది.
మజులి దాదాపు 100 రకాల వరి పంటలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడికి వెళ్లే పర్యాటకులు రకరకాల బియ్యం రుచి చూడొచ్చు. రవ్వంత కాలుష్యం లేని, ఎటుచూసినా కనిపించే పచ్చదనానికి పర్యాటకులు ఫిదా కావాల్సిందే.
ముఖ్యంగా ఈ ద్వీపం మధ్యలోని కాటేజ్‌ల నుండి సూర్యాస్తమయాన్ని చూడటం ఓ మరచిపోలేని మధురమైన అనుభూతి. అందుకే ఒకసారి ఇక్కడకు వచ్చిన వారు పదేపదే ఇక్కడికి వస్తుంటారు.
అలనాడు రాధాకృష్ణులు రాసక్రీడలాడిన ప్రదేశంగా దీనికి గుర్తింపు ఉంది. ఇందుకు గుర్తుగా ఏటా 3 రోజుల పాటు ఎంతో అట్టహాసంగా ఇక్కడ ‘రాస్‌లీలా’ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో కృష్ణుడు, గోపికల వేషధారులు ఆ కాలపు వేషధారణలో తమ ఆటపాటలతో వీక్షకులను ఆకట్టుకుంటారు.
అద్భుతమైన హస్త కళలకు ఇదో కేంద్రం. నాటి అసోం పాలకులు వాడిన వస్తువులు, ఆయుధాలు, దుస్తులున్న బెంగానాతి, కమలబరి, దఖినపాట్, అనియతి సత్రాల్లోని చారిత్రక సంపద పర్యాటకులను చూపు మరల్చుకోనీయదు.
కొత్తగా పెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం అని చెప్పవచ్చు. అస్సాంతో పలు సుదూర ప్రాంతాల హనీమూన్ కపుల్ ఇక్కడికొస్తారు. కొత్త వాతా వరణంలో, ప్రకృతి ఒడిలో ఏకాంతంగా గడపాలనుకునే జంటలకు ‘మజులి’ ఓ అద్భుతమైన అనుభవాన్నిస్తుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.