
Train Accidents in India(Current news from India): ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం.. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఆ విషాదాన్ని మరువక ముందే.. దేశవ్యాప్తంగా జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు పరేషాన్ చేస్తున్నాయి. ఇటీవల సీల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఒడిస్సాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీకి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఒడిశా రైల్వే ప్రమాదం తరువాతే జరగడంతో ప్రయాణికులు హడలిపోతున్నారు.
మధ్యప్రదేశ్‌లో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్‌ను తరలిస్తున్న రైలు పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు నెమ్మదిగా వెలుతుండటం.. రెండు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు తప్పిన సమయంలో వ్యాగన్లలో LPG ఉంది. LPGని అన్‌లోడ్ చేసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇక ఒడిశాలో సికింద్రాబాద్-అగర్తాలా ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలో పొగ వెలువడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును బ్రహ్మపూర్ రైల్వేస్టేషన్‌లో ఆపేశారు. పొగ వెలువడటానికి గల కారణాన్ని గుర్తించి పరిష్కరించారు. అయితే సమస్య పరిష్కారమైన తర్వాత రైలు ఎక్కడానికి చాలా మంది ప్రయాణికులు నిరాకరించారు. వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఏసీ బోగీని మార్చాలని అధికారులను కోరారు. మళ్లీ విద్యుత్ కారణంగా ప్రమాదం జరుగుతుందన్న భయంతో ప్రయాణికులెవరూ ఆ కోచ్‌లో ఎక్కేందుకు నిరాకరించారు అప్పట్లో.
యూపీలో సీల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌లో తెల్లవారుజామున మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
తమిళనాడులో ఓ రైలు కూడా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. కొల్లం జంక్షన్- చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీ కింది భాగంలో ఏర్పడిన పగుళ్లను తమిళనాడులోని సెంగోట్టై రైల్వే స్టేషన్‌లో గుర్తించారు. రైల్వే సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. పగుళ్లను గుర్తించిన రైల్వే సిబ్బంది ఆ బోగీని తొలగించి మధురైలో ప్రత్యామ్నాయంగా మరో బోగీని జోడించారు. చెన్నై- ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ త్రీ బోగీలో పగుళ్లను క్యారేజ్ వ్యాగన్ సిబ్బంది గుర్తించారు.
తాజాగా, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సడెన్‌గా మంటలు చెలరేగి పలు బోగీలు తగలబడిపోయాయి. ఛైన్ లాగి ట్రైన్‌ను వెంటనే ఆపేయడంతో.. ప్రయాణికులు రైలు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వరుస ప్రమాదాలతో రైలు ఎక్కాలంటేనే.. ప్రయాణికులు హైరానా పడుతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని.. రైలు ప్రయాణాలను తగ్గించుకుంటున్నారు. ఇటీవల జరిగిన అన్ని ప్రమాదాలకూ.. సరైన కారణం కనుక్కోలేకపోతున్నారు. ఇవన్నీ కేవలం ప్రమాదవశాత్తు జరిగాయా? కుట్ర కోణం దాగుందా? అనే అనుమానం మాత్రం లేకపోలేదు. ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి ముందు ఓ హెచ్చరిక లేఖ కూడా రావడంతో.. డౌట్స్ మరింత పెరుగుతున్నాయి.