
WFI: లైంగిక వేధింపులకు పాల్పడిన WFI అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయాలంటూ కొన్ని రోజులుగా భారత రెజ్లర్లు చేస్తున్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోయినా.. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ స్పందించింది. నిరసన చేస్తున్న భారత రెజ్లర్లను అరెస్ట్ చేసి తాత్కాలికంగా నిర్బంధించడాన్ని ఖండించింది. అంతేకాదు.. కొన్నాళ్లుగా పెండింగ్‌లో పెట్టిన WFI ఎన్నికలను నిర్వహించకపోతే.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది.
భారత రెజ్లర్ల విషయంలో అనుసరిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకరంగా ఉందన్న యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్… బ్రిజ్‌భూషణ్‌పై వస్తున్న ఆరోపణల మీద క్షుణ్ణంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు ముందుకు కదలకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత రెజ్లర్లను కలిసి వారి భద్రతపై ఆరా తీస్తామని, వారి పోరాటానికి మద్దతుగా నిలుస్తామని తెలిపింది.