
Artificial Intelligence:- తాగునీరు, ఆరోగ్యకరమైన ఆహారం అనేది అందరి హక్కు. కానీ ఆ హక్కు ఎంతమందికి దక్కుతుంది అనేదే ప్రశ్న. ఈరోజుల్లో కాలుష్యం వల్ల చాలామంది ఎంత డబ్బు పెట్టినా కూడా తాగునీరు అనేది దక్కడం కష్టంగా మారింది. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఆహారం కంటే స్వచ్ఛమైన నీరు దొరకడమే కష్టంగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీతో స్వచ్ఛమైన నీరును కూడా తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈరోజుల్లో టెక్నాలజీ వల్ల ఏదైనా సాధ్యమవుతుందని, ఒకప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే ఇలాంటివి జరుగుతాయి అనుకునే విషయాలు కూడా ఈరోజుల్లో నిజాలు అవుతున్నాయి. అందులో ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ). ప్రస్తుతం ఏఐ అనేది మనుషులకు ఎన్నో విధాలుగా సహాయపడుతోంది. అంతే కాకుండా టెక్నాలజీని కూడా కొత్త మలుపు తిప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆ ఏఐతోనే అందరికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ప్రస్తుతం క్యాలిఫోర్నియాలోని ప్రజలు స్వచ్ఛమైన తాగునీటి కోసం కష్టపడుతున్నారు. అందరికీ మంచినీటిని అందించాలని ప్రభుత్వాలకు ఉన్నా కూడా వాతావరణ మార్పులు అనేవి వారికి అడ్డుగా ఉంటున్నాయి. అందుకే ప్రభుత్వానికి సాయంగా ఇద్దరు వాటర్ ఇంజనీర్లు ముందుకు వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించవచ్చని సంతోషకరమైన విషయాన్ని బయటపెట్టారు. వారు క్యాలిఫోర్నియా ప్రజలు అందరికీ స్వచ్ఛమైన నీటిని అందించే చాట్‌బోట్‌ను తయారు చేయనున్నారు.
క్యాలిఫోర్నియా వాటర్ రీసౌర్సెస్ బోర్డ్ స్టాఫ్‌తో కలిసి ఈ కొత్త రకం చాట్‌బోట్ పనిచేయనుంది. చాట్‌బోట్‌తో తాగునీటిని ఏర్పాటు చేయడం కొంచెం కష్టమైన విషయమే అయినా పబ్లిక్ హెల్త్ కోసం ఇది తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాటర్ బోర్డ్ స్టాఫ్‌తో పనిచేయడం చేయడం ద్వారా పలు రూల్స్‌ను కూడా చాట్‌బోట్ నేర్చుకోవడానికి సహాపడుతుంది. ఈ విధంగా పబ్లిక్ వాటర్ సిస్టమ్స్‌కు కూడా చాలా సాయంగా ఉంటుందని చెప్తున్నారు.
ప్రస్తుతం చాట్‌బోట్‌తో స్వచ్ఛమైన నీటిని అందించాలి అనేది కేవలం ఆలోచన దగ్గరే ఉంది. కానీ పలు వనరులను ఉపయోగించి దీనిని నిజం చేయాలని శాస్త్రవేత్తలతో పాటు క్యాలిఫోర్నియా ప్రభుత్వం కూడా భావిస్తోంది. పబ్లిక్ హెల్త్ కోసం వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వారు అనుకుంటున్నారు. అందుకే వీలైనంత తొందరగా చాట్‌బోట్ తయారీని ప్రారంభించి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వగలదని ప్రజలకు చూపించాలనే పట్టుదలతో ఉన్నారు శాస్త్రవేత్తలు.