Cancer Treatment: ఈ రోజుల్లో టెక్నాలజీ పెరగడంతో మెడికల్ రంగంలో పరిశోధనలు, ప్రయోగాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఒక వ్యాధికి పలు చికిత్సలు, మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నా కూడా వాటిని మరింత మెరుగుపరచడం కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక మందును తయారు చేసి, దానికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, అవి సక్సెస్ అయిన తర్వాత పేషెంట్ల దగ్గరకు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో ఇంగ్లాండ్ ప్రభుత్వం ఓ ఒప్పందానికి వచ్చింది.
క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో ఇంగ్లాండ్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. బయోఎన్‌టెక్ ఎస్‌ఈ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్, డెవలప్‌మెంట్ అవుతున్న క్యాన్సర్ చికిత్సలను, మందులను నేరుగా పేషెంట్లపైనే ఉపయోగించాలని తేల్చింది. దీంతో పేషెంట్లకు కూడా లేటెస్ట్ చికిత్సలకు త్వరగా యాక్సెస్ దొరుకుతుంది. దీనికోసమే జెర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ ఇంతకు ముందు కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయంలో తన సామర్థ్యాన్ని బయటపెట్టింది.
ప్రస్తుతం యూకే శాస్త్రవేత్తలు ఇమ్యూనోథెరపీస్ విషయంలో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు. ఇక ఈ ఒప్పందాన్ని ఆ ఇమ్యూనోథెరపీస్‌తోనే ప్రారంభించాలని సంస్థ అనుకుంటోంది. ఈ ఇమ్యూనోథెరపీ ద్వారా మనిషి శరీరంలోని క్యాన్సర్ సెల్స్‌ను గుర్తించి వాటికి చికిత్సను అందించవచ్చు. 2030 వరకు 10 వేల మంది పేషెంట్లకు ఈ చికిత్సను అందించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. 2026లోపు ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో.. వారిపై ఈ ఇమ్యూనోథెరపీ ట్రయల్స్ నిర్వహించాలని బయోఎన్‌టెక్ సంస్థ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రయోగాలను ముందుకు తీసుకెళ్లడం కోసం కేంబ్రిడ్జ్‌లో ఒక ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి బయోఎన్‌టెక్ సన్నాహాలు చేస్తోంది. ఆ ల్యాబ్‌లో 70 మంది అనుభవం ఉన్న శాస్త్రవేత్తలతో ప్రయోగాలు చేయించనుంది. ఈ పార్ట్‌నర్‌షిప్ ద్వారా ముఖ్యంగా లేట్ స్టేజ్ క్యాన్సర్‌లో ఉన్న పేషెంట్లు బ్రతికే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాంటి వారిపై క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలు తగ్గిపోయే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. క్యాన్సర్ వ్యాక్సిన్స్ కూడా మెరుగ్గా పేషెంట్లపై పనిచేసే అవకాశం ఉంటుందన్నారు.