
Aditya-L1 Mission : సూర్యుడిపై పరిశోధనలకు సిద్ధమైంది ఇస్రో. శనివారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని చేపడతారు.
ఆదిత్య ఎల్1 ప్రయోగానికి 24 గంటల ముందు కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది. శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఈ ప్రక్రియ ప్రారంభించారు. మరోవైపు ఇప్పటికే PSLV-C57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించారు. దాన్ని లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ ఛైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు.
గురువారం షార్‌లో LPSC డైరెక్టర్ నారాయణన్ ఆధ్వర్యంలో రాకెట్ సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ప్రయోగంలోని వివిధ అంశాలపై చర్చించారు. వాహకనౌక అనుసంధానం, ఉపగ్రహ అమరిక, రిహార్సల్ అంశాలపై శాస్త్రవేత్తలు సమీక్షించారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించారు. ప్రయోగం చేపట్టేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టతకు వచ్చారు.
లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశంలో బోర్డు ఛైర్మన్ రాజరాజన్ ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. ఇస్రో అధిపతి సోమనాథ్ గురువారం రాత్రి షార్‌కు చేరుకున్నారు. సోమనాథ్ 3 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ శ్రీహరికోటకు రానున్నారు.