
Graphene Tattoo:- మామూలుగా టాటూలు అనేవి చాలామంది స్టైల్ కోసమే వేసుకుంటారు. మరికొందరు తమకు నచ్చినవారిపై ఇష్టాన్ని చూపించడం కోసం వేసుకుంటారు. కానీ ప్రతీ టాటూ వెనుక ఏదో ఒక బలమైన కారణం కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ టాటూ ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులను కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గ్రాఫెన్ అనే వస్తువుతో తయారు చేసిన టాటూ గుండెకు మంచిదంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమని అంటున్నారు.
గ్రాఫెన్‌తో తయారు చేసిన టాటూను ఒక ఎలుక గుండెపై వేశారు శాస్త్రవేత్తలు. ఇది ఎలుక గుండె కాస్త సరిగ్గా కొట్టుకోకపోయినా శాస్త్రవేత్తలకు సమాచారం అందించే పరికరంలాగా పనిచేయనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి పరికరాలు ఉన్నాయి. అందులో ఒకటి పేస్‌మేకర్. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ పేస్‌మేకర్‌ను ధరించి ఉండడం ద్వారా ఎప్పటికప్పుడు వారి హార్ట్ బీట్‌ను కనిపెడుతూ ఉంటుంది. అయితే దానికి అడ్వాన్స్ వర్షన్‌గా ఈ టాటూను ప్రవేశపెట్టాలనే ప్లాన్‌లో ఉన్నారు శాస్త్రవేత్తలు.
ప్రస్తుతం ఈ గ్రాఫెన్ టాటూ అనేది ఎలుకలపై ప్రయోగిస్తున్నారు శాస్త్రవేత్తలు. మరో అయిదేళ్లలో మనుషులపై కూడా పరిశోధనలు చేసి దీనిని మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ టాటూను తయారు చేయడానికి పనిచేసిన శాస్త్రవేత్తలు గత కొన్నేళ్లుగా ఇంప్లాంటబుల్ పరికరాల పరిశోధనలపైనే పూర్తిగా నిమగ్నమయిన్నారు. ఎలక్ట్రానిక్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి కాబట్టి గుండె టిష్యూలపై అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్నదే మెయిన్ ఛాలెంజ్‌గా మారింది.
ప్రస్తుతం ఉన్న పేస్‌మేకర్స్ ఎలా పనిచేస్తున్నయో గమనించిన తర్వాతే దానికంటే మెరుగైన గ్రాఫెన్ టాటూలను తయారు చేశామని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. మామూలుగా గ్రాఫెన్ పరికరాల ద్వారా తాత్కాలికంగా టాటూలు వేయడం గమనించిన శాస్త్రవేత్తలకు.. గుండెను గమనిస్తూ ఉండడానికి ఇవి ఉపయోగపడతాయనే ఐడియా వచ్చింది. గ్రాఫెన్ అనేది చాలా సన్నగా ఉంటుంది. కార్బన్ ఆటమ్స్‌తో నిండి ఉండే గ్రాఫెన్.. గీతల ఆకారంలో ఉంటుంది. ఇది బయోమెడికల్ రంగంలో మన అవసరాలకు తగినట్టుగా ఉపయోగించవచ్చని, తేలికగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
హార్ట్ టిష్యూలపై ఈ గ్రాఫెన్ టాటూను అతికించడం వల్ల హార్ట్ రేట్ గురించి గమనిస్తూ ఉండే అవకాశం ఉంటుందా లేదా తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు దీనిని ముందుగా ఎలుకలపై ప్రయోగించి చూశారు. ఒకవేళ హార్ట్ బీట్ సరిగా లేకపోతే పల్స్ రేటును కరెంటు రూపంలో మార్చి గుండెకు అందించే సౌకర్యం కూడా గ్రాఫెన్ టాటూ అందిస్తుంది. ప్రస్తుతం గ్రాఫెన్ టాటూ ప్రయోగాలు వైర్లతో జరుగుతున్నా కూడా త్వరలోనే మనుషులకు ఉపయోగపడే విధంగా వైర్‌లెస్ టాటూలను తయారు చేస్తామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.