
Chandrayaan-3 : చంద్రయాన్-3 మిషన్ లక్ష్యాలు తుది దశకు చేరుకున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశాయి. ఇక ల్యాండర్ , రోవర్ విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. చంద్రుడిపై రాత్రి మొదలయ్యే సమయానికి అవి విశాంత్రి స్థితిలో ఉంటాయి. రాత్రివేళ జాబిల్లి వాతావరణాన్ని తట్టుకునేలా ల్యాండర్‌ను, రోవర్‌ను స్లీప్ మోడ్‌లోకి పంపింది ఇస్రో.
ప్రస్తుతానికి మాత్రం అది తాత్కాలిక విరామమా లేక శాశ్వత నిద్రా అనేది తేలేందుకు రెండు వారాలు వేచివుండాల్సి ఉంటుంది. సోలార్ ప్యానెళ్ల ద్వారా శక్తిని పొందుతూ విక్రమ్, ప్రజ్ఞాన్ పనిచేస్తాయి. జాబిల్లిపై చీకటి పడితే ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీలకు పడిపోతాయి. ఆ సమయంలో ల్యాండర్, రోవర్ మనుగడ సాగించడం కష్టమే. అయితే..14 రోజుల తర్వాత చంద్రుడిపై తిరిగి సూర్యోదయం అయిన తర్వాత విక్రమ్, ప్రజ్ఞాన్ వాటిలోని పేలోడ్‌లు తిరిగి పనిచేసే అవకాశాలు చాలా స్వల్పమని భావిస్తున్నారు.
రోవర్ తన లక్ష్యాలను పూర్తి చేసుకుందని..ఇప్పుడు సురక్షిత ప్రదేశంలో నిలిపి ఉంచి.. నిద్రాణ స్థితిలోకి పంపేశామని తెలిపారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. అందులోని APXS, లిబ్స్ పరికరాలను స్విచ్ఛాఫ్ చేసినట్లు చెప్పారు. ఈ రెండు సాధనాల నుంచి డేటా ల్యాండర్ ద్వారా భూమికి చేరిందన్నారు ఇస్రో ఛైర్మన్.