
Super Blue Moon: ఆకాశంలో అద్భుతం. చంద్రుడు మరింత ప్రకాశవంతంగా, శోభాయమానంగా కనిపిస్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఈ పున్నమి చంద్రుడు కాస్త స్పెషల్‌గా ఉంటాడు. అందుకో కారణం ఉంది. అదే సూపర్ బ్లూ మూన్.
చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వస్తే అది సూపర్ మూన్. ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తే అది బ్లూ మూన్. రెండూ కలిపి.. ఈసారి ఏకంగా సూపర్ బ్లూ మూన్ ఏర్పడింది. అంటే, భూమికి అతిదగ్గరగా రావడంతో పాటు ఒకే నెలలో ఇది రెండో పౌర్ణమి కూడా. సూపర్ బ్లూ మూన్.. రాఖీ పౌర్ణమి నాడు రావడం మరింత ఆసక్తికరం.
పౌర్ణమి నాడు చంద్రుడు భూమికి మరింత దగ్గరగా రావడంతో ఈ అద్భుతం ఆవిశ్కృతమైంది. సూపర్ బ్లూ మూన్ సందర్బంగా.. చంద్రుడు భూమికి 3,57,244 కి.మీ దగ్గరకు వచ్చేశాడు. ఇండియాలో రాత్రి 8.37 తర్వాత బ్లూ మూన్ కనిపిస్తుంది. ఈ సమయంలో చందమామ మామూలు కంటే 7 శాతం పెద్దగా, 16 శాతం ప్రకాశవంతంగా ఉంటుంది.
నిజానికి చంద్రుడు కనిపించేది ఆరెంజ్, లైట్ ఎల్లో, వైట్ కలర్‌లోనే. కానీ.. దీనిని బ్లూ మూన్ అనే పిలుస్తారు. ఇంగ్లీష్‌లో వన్స్ ఇన్ ఏ బ్లూమూన్.. అనే నానుడి కూడా ఉంది.
సూపర్ బ్లూ మూన్ ప్రతీ పదేళ్లకు ఒకసారి కనిపిస్తుందని నాసా అంటోంది. ఒక్కోసారి 20 ఏళ్లు కూడా పట్టొచ్చట. 2009లో సూపర్ బ్లూ మూన్ వచ్చింది. మళ్లీ ఇప్పుడే మరోటి ఏర్పడింది. ఇంకో సూపర్ బ్లూ మూన్ చూడాలంటే 2037 వరకూ ఆగాల్సిందే. అప్పటి వరకూ ఎందుకు ఆగడం? ఇప్పుడే చూసేస్తే పోలా!