
Amit Shah Gadwal : బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ గద్వాల్‌లో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అత్యంత అవినీతి పార్టీ అని, కేసీఆర్ కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన విమర్శలు చేశారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో భారీగా అవినీతి జరిగిందని షా ఆరోపణలు చేశారు. తమ పార్టీ గెలిస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలని మోసం చేశారని ధ్వజమెత్తారు. అబద్ధాపు ప్రచారాలతో కేసీఆర్ ప్రజలను ఇంకా మోసం చేస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి ప్రధాన మంత్రి మోడీ రూ. 70 కోట్లు ఇచ్చారు, కానీ ఆ డబ్బులను కేసీఆర్ వినియోగించలేదని ఆరోపించారు. ఇంతవరకు గుర్రం గడ్డ వంతెన, గట్టులిఫ్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో రైతులకు కనీస హక్కులు ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు.
బీసీలను కేసీఆర్ సర్కార్ మోసం చేసింది, కానీ బీజేపీ బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చిందని అమిత్ షా గుర్తు చేశారు. 52 శాతం బీసీ ఓటర్లు 130 కులాలున్న బీసీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే తెలంగాణ సీఎం చేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం కేంద్రం దృష్టికి కేసీఆర్ ఎందుకు తీసుకు రాలేదు అని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా బీసీ ద్రోహులని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నుంచి తెలంగాణను విముక్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీ గెలిస్తే వచ్చే అయిదేళళ్లో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అమిత్ షా బహిరంగ సభలో హామీ ఇచ్చారు. తమ పార్టీని గెలిపిస్తే తెలంగాణలో అభివృద్ధి సాధించి చూపిస్తామని ఆయన అన్నారు.