
Kodangal : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. కోస్గి మండలంలో బీఆర్ఎస్- కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సర్జాఖాన్‌పేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలను.. సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి అనుచరులు రెచ్చగొట్టారని తెలుస్తోంది. AS రావు నగర్ కార్పొరేటర్ శిరీష భర్తే సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్‌ను ఆయన ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు . దాదాపు 50 వాహనాల్లో 100 మంది అనుచరులతో కోస్గికి వచ్చిన సోమశేఖర్‌రెడ్డి.. తమపై దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ప్రస్తుతం కొడంగల్‌లో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వరుస దాడుల ఘటనలతో కొడంగల్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. శాంతియుత వాతావరణం నెలకొనేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో హాట్ టాపిక్ ఉన్న నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. ఇక్కడ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి రేవంత్ గెలుపు లాంఛనమే అనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొండగల్ లో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు జరగడం ఉద్రిక్తతలు దారితీసింది. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి చర్యలను పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
.
.
.