
Azharuddin political news(Political news in telangana):
భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే..హైదరాబాద్‌లో పోటీ చేస్తున్నానని బిగ్ టీవీ ఇంటర్య్వూలో తెలిపారు. తాను ఉత్తర్ ప్రదేశ్ లోని మురాదాబాద్‌లో ఎంపీగా పోటీ చేసినప్పుడు.. అంత దూరం ఎందుకు వెళ్లావని చాలా మంది అడిగారని వెల్లడించారు. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే అక్కడ పోటీ చేశానని అజారుద్దీన్ వివరించారు.
ఇప్పుడు తెలంగాణలో పోటీ చేసే అవకాశం వచ్చిందని అజారుద్దీన్ అన్నారు. తాను ఎప్పటికీ తెలంగాణ బిడ్డనేనని స్పష్టం చేశారు. తెలంగాణలో పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. గత పదేళ్లుగా జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి జరగలేదన్నారు.ఈ నియోజకవర్గం పరిస్థితి పేరు గొప్ప, ఊరు దిబ్బలా ఉందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఇక్కడి ఓటర్లు.. తనను ఆదరిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం ఎక్కువగా ఉందని అజారుద్దీన్ ఆరోపించారు. అరాచక శక్తులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఇక్కడ జనం భయంతో బతకాల్సిన పరిస్థితి ఉందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదన్నారు. పరిస్థితులు అంత తీవ్రంగా ఉన్నాయని చెప్పారు.
తనను గెలిపిస్తే జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం లేకుండా చేస్తానని అజారుద్దీన్ స్పష్టం చేశారు. ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితులు కల్పిస్తానన్నారు. 10 ఏళ్లుగా జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందలేదన్నారు.ఎంఐఎం ముస్లింల కోసం ఏమీ చేయడం లేదన్నారు. అసదుద్దీన్ మాటలే తప్ప చేతల్లో చూపడం లేదని విమర్శించారు. తన గెలుపై ధీమ వ్యక్తం చేశారు.
.
.