
Vemulawada : తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. ఆఖరి క్షణాల్లో అభ్యర్థులను మార్చేసింది. వేములవాడ టిక్కెట్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. చెన్నమనేని వికాస్ రావు కు చివరిలో క్షణంలో టిక్కెట్ ఇచ్చింది. తొలుత తుల ఉమను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. చివరి నిమిషంలో వేములవాడ అభ్యర్థిని మార్చేసింది. తుల ఉమని పక్కనపెట్టి వికాస్‌రావుకు బీఫామ్ ఇచ్చింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జెడ్పీ ఛైర్ పర్సన్ గా చేసిన తుల ఉమ.. ఈటల రాజేందర్ తోపాటు బీజేపీలో చేరారు. ఈటల గులాబీ గూటి నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆయనకు అండగా నిలిచారు. హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల విజయం కోసం ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించేందుకు ఈటల ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించి వేములవాడ టిక్కెట్ ఇప్పించుకోగలిగారు. కానీ చివరి నిమిషంలో ఈటలకు అధిష్టానం షాకిచ్చింది.
వేములవాడ టిక్కెట్ ను బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు ఆశించారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మద్దతుగా నిలిచారు. తొలుత టిక్కెట్ తుల ఉమకు ఇవ్వడంతో వికాస్ రావు వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద కూడా వికాస్ రావు అనుచరులు ఆందోళన చేశారు. ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కార్యకర్తల మద్దతు ఎక్కువగా వికాస్ రావుకే ఉండటంతో బీజేపీ అధిష్టానం చివరి నిమిషంలో తలొగ్గింది. వికాస్ రావుకే వేములవాడ బీ ఫామ్ ఇచ్చింది.
అటు సంగారెడ్డిలోనూ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చేసింది కాషాయ పార్టీ. సంగారెడ్డి అభ్యర్థిగా పులిమామిడి రాజు పేరు ప్రకటించింది. తొలుత ఇక్కడ టిక్కెట్ దేశ్‌పాండేకు ఇచ్చింది. అయితే ఆయనను పక్కనపెట్టి పులిమామిడి రాజుకు బీఫామ్ ఇచ్చింది. దీంతో సంగారెడ్డిలో దేశ్‌పాండేకు బదులుగా పులిమామిడి రాజు బరిలోకి దిగారు.