
BJP : తెలంగాణలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతోంది. ప్రచారానికి మరో రెండు వారాలు మాత్రమే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఆ రెండు పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యే సాగుతుందని స్పష్టంగా తేలిపోయింది.
ఎన్నికల రేసులో బీజేపీ మాత్రం బాగా వెనుకబడింది. అభ్యర్థుల ప్రకటన విషయంలో చాలా జాప్యం చేసింది. నామినేషన్ల చివరిరోజు కూడా అభ్యర్థులను ప్రకటించింది. అలాగే కొన్ని స్థానాల్లో అభ్యర్థులను సైతం మార్చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి వేములవాడలో పెద్ద షాకే తగిలింది. తొలుత అక్కడ సీటు ఈటల రాజేందర్ అనుచరురాలు తుల ఉమకు ఇచ్చారు. అయితే చివరి క్షణాల్లో అనూహ్యంగా అభ్యర్థిని మార్చారు. వేములవాడ బరిలో చెన్నమనేని వికాస్ రావును నిలిపారు. ఈ పరిణామాలతో తుల ఉమ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆమె బీఆర్ఎస్ లో చేరిపోయారు. అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ లాంటి సీనియర్ నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పారు. వారు కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ నుంచి పోటీకి దిగారు. ఇలా ఎన్నికలకు ముందుకు చాలా షాకులు బీజేపీకి తగిలాయి.
పార్టీలో అసంతృప్తులు ఒకవైపు బీజేపీని కలవరపెడుతుండగా మరోవైపు మేనిఫెస్టో రిలీజ్ చేయకపోవడంపై కాషాయ శ్రేణుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందని తెలుస్తోంది. హైదరాబాద్ లో రెండు సభల్లో ప్రధాని మోదీ, సూర్యపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న పార్టీలో జోష్ పెరగలేదని టాక్. బీసీని సీఎం చేస్తామని ప్రకటించినా ఆయాఆయా వర్గాల స్పందన అంతంతమాత్రంగా ఉంది.
మరోవైపు పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతో కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. నవంబర్ 17 కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్ లో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అలాగే అదే రోజు 4 బహిరంగ సభల్లోనూ అమిత్ షా పాల్గొంటారు. నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్ లో బహిరంగ సభలు నిర్వహించేందుకు కాషాయ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Rahul Gandhi: వాళ్లు కాంగ్రెస్ ని వీడాలన్న రాహుల్.. ఎందుకంటే..?