
BJP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ దగ్గర పడుతున్నా బీజేపీ పార్టీలో ఆ హడావుడి కనిపించడం లేదు. గెలవాలన్న ఆలోచన లేదా లేకపోతే అధికార పార్టీని గెలపించాలని ఆలోచిస్తున్నారా అనేది పార్టీ కార్యకర్తలకు అంతుచిక్కట్లేదు. అభ్యర్థుల ఖరారు ఆలస్యం చేయడంతో పాటు ఇంతవరకు మేనిఫెస్టోను ప్రకటించలేదు. కమలనాథులు ఇక ఇప్పుడేమో అసలు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి దూకుడు ప్రదర్శించడం లేదు . ఇన్నాళ్లు అధికార బీఆర్ఎస్ పై విమర్శలు, ఆరోపణలు చేసిన బీజేపీల్లో ఏదో తెలియని గందరగోళం కనిపిస్తోంది. రాబోయేది తమ ప్రభుత్వం అంటూ.. దూకుడు చూపించిన బీజేపీ నేతలు ప్రస్తుతం డిఫెన్స్‌లో పడిపోయినట్టు కనిపిస్తోంది.
ఓ వైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ప్రచారంలో దూకుడు మీద ఉంటే.. అన్ని విషయాల్లోనూ బీజేపీ వెనకబడిపోతోంది. ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగులు, సామాన్యులు, రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా బీజేపీ.. మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలకి భిన్నంగా రూపొందించినట్లుగా సమాచారం.
బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు. ముందుగా ఈనెల 17న మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని బీజేపీ వర్గాలు ప్రకటించాయి. అయితే ఆయన షెడ్యూల్ మారడం వల్ల ఈనెల 18కి ప్రోగ్రామ్‌ని మార్చారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ తీరు బీఆర్ఎస్‌కి సపోర్ట్ చేసేలా ఉందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. దీనికి తగ్గట్టుగానే పార్టీ అగ్రనేతల తీరు ఉందన్న విమర్శలు వస్తున్నాయి.