
Telangana Elections : తెలంగాణ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. దీపావళి పండగ సందర్భంగా ఈ బ్రేక్ తీసుకున్నారు పార్టీ నేతలు. అయితే.., నిర్విరామంగా సుడిగాలి పర్యటనలతో రోజుకి మూడు సభలతో ప్రచారాన్ని హోరెత్తించిన బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. ఈ బ్రేక్ సమయంలోనూ గెలుపు వ్యూహాల్లో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్, కామారెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న గజ్వేల్, హుజూరాబాద్ నియోజకవర్గాలతోపాటు పలువురు ప్రతిపక్ష కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. వారిని ఓడించేందుకు ఇంకా ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలనే దానిపై మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సహాలు పలువురు నేతలతో చర్చలు జరుపుతున్నారు. దీంతోపాటు ఆయన ఇప్పటి వరకు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు ఫీడ్ బ్యాక్‌పై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మేనిఫెస్టో అంశాలపై ప్రజల స్పందన ఏంటనే దానిపై కూడా చర్చించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల తర్వాత ఎక్కడెక్కడ ఎలాంటి స్పందన వచ్చింది, మేనిఫెస్టో గురించి ప్రజల్లో ఏమేరకు చర్చ జరుగుతోంది అనే విషయాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్, సర్వే సంస్థల రిపోర్టులు, వార్ రూంల నుంచి వచ్చిన సమాచారంపై కూడా సమీక్షించనున్నారు కేసీఆర్. ప్రత్యర్థి వర్గాలు బలంగా ఉన్నచోట్ల రోడ్ షో లు నిర్వహించే విషయంపై కూడా చర్చలు జరుగుతాయి.
దీవాళీ బ్రేక్ తర్వాత సీఎం కేసీఆర్ మళ్లీ తన ప్రచార జోరును పెంచనున్నారు. ఎల్లుండి నుంచి ఈ నెల 28 వరకు వరుసగా 54 సభల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రోజుకి 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు గులాబీ బాస్. ఇక ఇప్పటి వరకు సభలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. రోడ్‌షోలపై దృష్టి సారించారు. ఈ మేరకు ఈ నెల 18న చేర్యాలలో భారీ రోడ్డు నిర్వహించనున్నారు.
ఇక మరోపక్క వరుస పర్యటనలతో బిజీగా గడిపిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. పండుగ పర్వదినాన్ని పురష్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్న ఆయన.. ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ.. మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడంలో బిజీకానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందనే విషయాలను మీడియా ముఖంగా ప్రజలతో పంచుకోనున్నారు.