
Telangana Elections : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక కుట్ర రాజకీయం ఉందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకే పీకే ఇలాంటి వ్యూహాలను అందజేస్తుంటాడంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించి.. సింపథీని రాబట్టుకునేందుకు బీఆర్ఎస్ తన స్ట్రాటజిస్టు సలహాలతో కొత్త కుట్రలకు తెరలేపారన్నారు. అయితే వచ్చే 15 రోజుల్లో మరో 3 దాడులు జరిగే అవకాశం ఉందని.. కేటీఆర్ ముందస్తుగా చెప్పడం ఆశ్చర్యంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. దాడులు జరుగుతున్నాయని కేటీఆర్‌కు ముందే తెలుసా? అయితే ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
కత్తి దాడి తర్వాత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రికి చేరకముందే హరీష్ రావు అక్కడికి చేరుకొని హంగామా సృష్టించాడన్నారు. వాళ్ల ప్లాన్‌లో భాగంగానే దాడులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు హ్యాక్ అవుతాయని రేవంత్ ఆరోపించారు. నేతలతో పాటు కొంత మంది మీడియా ఉద్యోగుల ఫోన్లు కూడా బీఆర్ఎస్ సర్కార్ హ్యాక్ చేస్తుందని రేవంత్ ఆరోపించారు. పదవీ విరమణ పొందిన అధికారులను ప్రైవేట్ సైన్యంగా వాడుకొని సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నాడన్నారు. ఏపీకి చెందిన అధికారులను వెంటనే తిప్పి పంపకపోతే.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చర్యలు తప్పవన్నారు రేవంత్ రెడ్డి.
అటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్‌పై దాడి.. ఇటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీపై దాడి.. ఇదంతా స్ట్రాటజీలో భాగమే అని పలువురు రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అయితే అదే స్ట్రాటజీని ఇప్పుడు తెలంగాణలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ వాడుతుందని.. ఇది మొదటికే మోసం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్కుంటే ఈ కుట్ర కోణాలను ఎన్నికల కమిషన్ బయట పెడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే..