
Telangana Elections : తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార బీఆర్ఎస్‌లో ఆందోళన పెరుగుతోంది. దీనికి తోడు వరుసగా వస్తున్న సర్వేలు కూడా కేసీఆర్ కాళ్ల కింద నేలను కదిలిస్తున్నాయని పలువురు చెబుతున్నారు. ఇటీవల వరుస సర్వేలు బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం అంత ఈజీ కాదని తేల్చి చెప్పేశాయి. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నట్లు చెబుతున్నాయి.
రీసెంట్‌గా ఇండియా టీవీ సీ ఓటర్ సర్వే కూడా అదే విషయాన్ని చెప్పింది. ఈ సర్వేతో బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. దీంతో.. క్రైసిస్ మేనేజ్మెంట్‌కు కేసీఆర్ ప్రణాళిక సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఏం చేయాలో.. ఎలా చేయాలో కేటీఆర్‌కు దిశానిర్ధేశం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ చెప్పిందే తడువుగా మంత్రి కేటీఆర్ కూడా రంగంలోకి దిగారట.
తెలంగాణలో కొద్దో గొప్పో గుర్తింపున్న సర్వే సంస్థలతో సంప్రదింపులు జరిపి.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రిపోర్ట్స్ ఇవ్వాలని అడిగారట. అయితే, మంత్రి కేటీఆర్ ప్రతిపాదనకు కొన్ని సర్వే సంస్థలు నో చెప్పినట్టు తెలుస్తోంది. ఇలాంటి తప్పుడు సర్వేలు చెబితే తమ క్రెడిబిలిటీ పోతుందని స్పష్టం చేశాయని తెలుస్తోంది.కానీ ఒకటి,రెండు సంస్థలు మాత్రం ఆలోచించుకొనే సమయం కావాలని చెప్పాయట. అయితే రీసెంట్ గా.. ఓ సర్వే సంస్థ తమ రిపోర్ట్‌ను ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేసింది. ఆ ప్రెస్‌మీట్ కు లైవ్ కవరేజ్ ఇవ్వాలని కేటీఆర్ ఆఫీస్ నుంచి మీడియా సంస్థలకు ఫోన్ కాల్స్ వెళ్లాయని వార్తలు వినిపిస్తున్నాయి.
సర్వేలతో నష్టనివారణ చర్యలు చేపడుతూనే.. మరోవైపు స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు మెయిన్ ఛానెల్స్‌కు లైవ్ ఇంటర్వ్యూస్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఛానెల్స్‌కి ఒక రౌండ్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏదో ఒకలా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇవన్నీ చూస్తే ప్రగతి భవన్‌లో ఏ స్థాయి ఆందోళన ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.