
Etala Rajendar : తెలంగాణలో గజ్వేల్ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది సీఎం కేసీఆర్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ నుంచి మరోసారి గులాబీ బాస్ బరిలోకి దిగుతున్నారు. అలాగే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ లో గెలుపు నమ్మకం లేక కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
గజ్వేల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీలో ఉండటం ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ నుంచి పోటీ చేస్తానని గతంలో చాలాసార్లు ఈటల ప్రకటించారు. చెప్పినట్టే గజ్వేల్ బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.
వర్గల్ సరస్వతీ దేవి ఆలయంలో ఈటల ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. గజ్వేల్ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా గజ్వేల్‌లో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
గజ్వేల్‌లో బీజేపీ సమావేశాలకు రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారని ఈటల ఆరోపించారు. దావతులు ఇచ్చి, పైసలు పంచి రాకుండా నిలువరిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలోనూ ఇలానే చేశారని విమర్శించారు. కానీ ప్రలోభాలకు హుజూరాబాద్ ప్రజలు పాతరేసి ధర్మాన్ని, న్యాయాన్ని, ఉద్యమ బిడ్డను గెలిపించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్‌లో అలాంటి ఫలితమే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని కాపాడాలని గజ్వేల్ ప్రజలను ఈటల కోరారు.