
Jeevan Reddy : తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకు బలపడుతోంది. అనేక సర్వేలు హస్తం పార్టీవైపే మొగ్గుచూపుతున్నాయి. దీంతో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ మరింత పెరిగింది. నేతల్లోనూ అదే ఉత్సాహం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డిపై జీవన్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. కేసీఆర్‌ను ఓడగొట్టే మొనగాడు రేవంత్‌రెడ్డేనని కితాబిచ్చారు. కేసీఆర్‌ను ఓడగొట్టాలని ప్రజలు కసితో ఉన్నారు. అందుకే ప్రతి ఓటు ఓ కాంగ్రెస్ కార్యకర్తగా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నారు. కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీకి నిలబడితే కాంగ్రెస్ గెలిచే మొదటిస్థానం అదే అన్నారు. ఆ ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందని జీవన్‌రెడ్డి తేల్చిచెప్పారు.
1989లో కాంగ్రెస్ గాలి ఇలాగే వీచిందన్న జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఆనాడూ కల్వకుర్తిలో అప్పటి సీఎం ఎన్టీఆర్ ను కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ ఓడిస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. కానీ ఓడించారని వివరించారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని జీవన్ రెడ్డి స్పష్టంచేశారు.