
KCR Karnataka : పక్క రాష్ట్రాల వైఫల్యాలనే బీఆర్ఎస్ సర్కార్ నమ్ముకుంటోందా? కర్ణాటకలో సిద్ధరామయ్య పగ్గాలు చేపట్టి ఆర్నెళ్లు పూర్తవకుండానే వైఫల్యాలను నెట్టేసి.. తెలంగాణలోనూ అదే రిపీట్ అవుతుందని ప్రచారం చేయడం కీలకంగా మారింది. విమర్శలతో ఆగకుండా.. ఏకంగా న్యూస్ పేపర్లలో ఫుల్ పేజ్ అడ్వర్టయింజ్ మెంట్లు ఇస్తోంది బీఆర్ఎస్. అన్ని దారులు మూసుకుపోవడంతోనే ఇలా చేస్తున్నారా అన్న డౌట్లు జనంలో పెరుగుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఎన్నికల ప్రచారం అంటే.. ఏ అధికార పక్షమైనా తాము ఇన్నాళ్ల పాలనలో సాధించిన విజయాలు చెప్పుకుంటుంది. అలాగే తాము ఇచ్చిన హామీలను చెప్పుకుంటుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు తాము వస్తే చేసే పనుల గురించి హామీల గురించి, అధికార పక్షం వైఫల్యాల గురించి ప్రచారం చేస్తుంటాయి. కానీ అదేంటో విచిత్రం తెలంగాణలో మాత్రం అధికార బీఆర్ఎస్ కంప్లీట్ గా రూట్ మార్చేసింది.
పక్క రాష్ట్రం వైఫల్యాలను తెలంగాణలో ప్రచారం చేస్తోంది. అవును కర్ణాటకలో ఆర్నెళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ 5 గ్యారెంటీలతో వారు అధికారంలోకి వచ్చారు. అయితే సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పడి ఆర్నెళ్లు గడవక ముందే వారి వైఫల్యాలు ఇవే అంటూ ఇక్కడి న్యూస్ పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్ లు ఇస్తోంది బీఆర్ఎస్ పార్టీ. తాము సాధించిన విజయాల గురించి చెప్పుకోకుండా పక్క రాష్ట్ర ప్రభుత్వంపై పడడం ఏంటన్న వాదన తెరపైకి వస్తోంది.
పక్కరాష్ట్రంపై ప్రచారం చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ కు ఓట్లు వస్తాయా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. తాము ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టో గట్టెక్కించే పరిస్థితి లేదని గులాబీ నేతలు అనుకుంటున్నారా అన్న ప్రశ్నలను వినిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెళ్లలోపే సమస్యలన్నీ తీరే పరిస్థితి ఉంటుందా అన్న వాదనను వినిపిస్తున్నారు. అయినా తాము అధికారంలోకి రాగానే గ్యారెంటీలను ప్రయారిటీగా తీసుకుని వంద రోజుల్లోనే అమలు చేస్తున్నామని, అదే కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం సాధించారని కర్ణాటక మంత్రి మునియప్ప ప్రశ్నిస్తున్నారు.
కర్ణాటకలో సమస్యలున్నాయని పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చి ఓట్లు సాధించాలనుకునే బీఆర్ఎస్ వ్యూహం అసలే వర్కవుట్ కాదంటున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఆర్నెళ్లు పూర్తికాకుండానే ఫెయిల్యూర్స్ అంటగట్టడం అది బీఆర్ఎస్ కే రివర్స్ అవుతుందంటున్నారు. ఇచ్చిన హామీలు, చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలు చెప్పుకోలేని పరిస్థితి కేసీఆర్ కు ఉందా అన్న ప్రశ్నల్ని వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు తెలంగాణలో కర్ణాటకం గులాబీదళానికి వర్కవుట్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది.
పదేళ్లు అధికారంలో ఉండడం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో గులాబీదళానికి అర్థం కావడం లేదన్న టాక్ ఉంది. దీంతో ఎక్కడ ఏ టాపిక్ దొరికినా దాన్ని హైలెట్ చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్ కాన్ పై రాయని లేఖను రాసినట్లు కొందరు క్రియేట్ చేయగా దానిపైనే కేటీఆర్ సహా మిగితా గులాబీ నేతలు ప్రచారం చేసుకున్నారు. చివరకు ఆ సమాచారాన్ని వెరిఫై చేసుకోలేదని స్వయంగా కేటీఆరే చెప్పారు. అంతే కాదు.. కరెంట్ 5 గంటలే వస్తోందని, 5 గ్యారెంటీలు అమలు కావడం లేదంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. అయితే బీఆర్ఎస్ కు అన్నిదారులు మూసుకుపోవడంతోనే కర్ణాటక టాపిక్ ఎత్తుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.