
KCR : అచ్చంపేట ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్‌ను ఓడిస్తే తనకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ప్రజలకే నష్టం అన్నట్టు ప్రసంగించారు కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రిది నిర్వేదమా? బెదిరింపా? కేసీఆర్ మాటల పరమార్థం ఏమిటి? ఎన్నికల్లో ఓటమిని ఆయన ముందే ఊహిస్తున్నారా? సెంటిమెంట్ కోసమే ఆ డైలాగ్ వాడారా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని కేసీఆర్ అన్నారు. పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్రం కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగా ప్రయాణం ప్రారంభించానని చెప్పుకొచ్చారు. నేడు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. దేశానికి దిక్సూచిగా రాష్ట్రం ఎదిగిందన్నారు. కొండగల్ రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు తనకు సవాలు విసురుతున్నారని.. కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసిందన్నారు. కొత్తగా చూపించాల్సిన పనిలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన చాలెంజ్ ను పరోక్షంగా ప్రస్తావించారు.
రాష్ట్రం కోసం తనవంతు పోరాటం అయిపోయిందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక చేయాల్సింది ప్రజలేనని తేల్చిచెప్పారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. ఎవరు గెలిస్తే తెలంగాణ ముందుకు వెళ్తుందో వారినే గెలిపించాలని కోరారు. ఇలా ఎన్నికల తీర్పును ప్రజాకోర్టులోకి నెట్టారు కేసీఆర్. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే హాట్ టాపిక్ గా మారాయి. ఓటమిని ముందే ఊహిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో రోజురోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది. కేసీఆర్ కొద్దిమంది మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చేశారు. ఇప్పటికే చాలామంది బీఫామ్స్ కూడా అందుకున్నారు. అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థుల ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించారు. కానీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని అనేక సర్వేలు వెల్లడించాయి. కాంగ్రెస్ బలంగా బాగా పెరిగిందని స్పష్టం చేశాయి. ఈ అంశాలే కేసీఆర్ ను కలవరపెడుతున్నాయి. హ్యాట్రిక్ ఆశలు ఆవిరి అవుతాయనే అనుమానం ఆయనలో కలిగిందనేలా తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికి 55 స్థానాల్లో మాత్రమే టిక్కెట్లు ప్రకటించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ములుగు నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. చాలా మంది నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. టిక్కెట్ దక్కని చాలా మంది నేతలు ఇప్పటికే కారు దిగిపోయారు. కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అనేక సర్వేల్లో కాంగ్రెస్ బలంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పై నమ్మకం రోజురోజుకు పెరుగుతోంది. అందుకే హస్తం గూటికి చేరేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. అటు బీజేపీ పూర్తిగా డీలా పడింది. బీజేపీ తొలి విడతలో 52 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 67 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ పార్టీ ప్రచారంలోనూ వెనుకబడింది.
ప్రస్తుతం వార్ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యేనని స్పష్టంగా తేలిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా కాంగ్రెస్ కు షిఫ్ట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలే గులాబీ బాస్ ను కలవరానికి గురిచేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.