
KCR speech : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మానకొండూరు , స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపి, భూమాత తెస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ వస్తే జరిగేది భూమాతనా? భూ‘మేత’నా? అని సెటైర్లు వేశారు. ధరణిని బంద్ చేస్తే రైతు బంధు నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
అభ్యర్థి వ్యక్తిత్వం, పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని నకిరేకల్ సభలో కేసీఆర్ సూచించారు. ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ద్వారా రామన్నపేట మండలానికి నీళ్లు అందిస్తామని చెప్పారు. బస్వాపూర్ నుంచి రామన్నపేటకు నీళ్లు అందిస్తామన్నారు. తెలంగాణ సాధన కోసమే బీఆర్ఎస్ పుట్టిందని స్పష్టం చేశారు. స్వరాష్ట్రం కోసం 15 ఏళ్లు పోరాటం చేశామన్నారు. అనేక మంది జైలు పాలయ్యారని వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 1969లో 400 మందిని కాల్చి చంపారని తెలిపారు.
అవకాశం ఇచ్చిన వారు ఏం చేశారు? మరోసారి అవకాశం ఇస్తే ఇంకేం చేస్తారనే విషయాలను ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని స్టేషన్ ఘన్‌పూర్ సభలో కేసీఆర్ అన్నారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఏం చేసింది? స్టేషన్ ఘన్‌పూర్‌కు ఏం చేశాం? అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు.
మానుకొండూరు సభలో కేసీఆర్ వరాలు ప్రకటించారు. రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఫిట్‌నెస్ ఛార్జీ, సర్టిఫికెట్ కి అయ్యే ఖర్చు రద్దు చేస్తామన్నారు. దేశంలో హోంగార్డులకు అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.