
Komatireddy Rajgopal Reddy : తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. అక్టోబర్ 27న ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది.
అవినీతిమయమైన కేసీఆర్ సర్కారుపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ విఫలమైందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ ఎదగలేకపోయిందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించేందుకు బీజేపీకి గుడ్ బై చెప్పానన్నారు. కేసీఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలన్న తన ఆశయం మరో ఐదు వారాల్లో నేరవేరుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టమవుతోందన్నారు.
ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో డీలా పడిందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను చూస్తున్నారని తెలిపారు. అందుకే తాను కూడా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నానన్నారు. సకల జనుల పోరాటంతో సాకారమైన ప్రత్యేక తెలంగాణ పదేళ్ల కేసీఆర్ సర్కారు అరాచక పాలనతో గాడి తప్పిందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్నానని తనను ఆదరించాలని ప్రజలను రాజగోపాల్ రెడ్డి కోరారు.
మరోవైపు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే ఆయన ఎల్బీనగర్ నుంచి పోటీకి దిగాలని భావిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉందని అంచనా వేశారు. సెటిలర్ల ఓట్లు కూడా తనకు కలిసి వస్తాయన్న ధీమాతో ఉన్నారు.