
Mallikarjun Kharge latest news(TS election news):
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలోనే కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించింది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేద ప్రజల గురించే ఆలోచిస్తుందని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ.. ప్రజల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారని.. కానీ చేయలేకపోయారని మండిపడ్డారు. అందుకే మోదీ అబద్ధాల ప్రధాని అని సెటైర్లు వేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ధనిక రాష్ట్రంగా ఉండేదని ఖర్గే పాత లెక్కలు వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ అధికారం చేపట్టాక ప్రజలపై అప్పులభారం మోపారని విమర్శించారు. ఇప్పుడు ఒక్కొక్కరిపై రూ.లక్షా 50వేల అప్పు ఉందని తెలిపారు. అందుకే ప్రజలను మోసం చేసిన మోదీ, కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల కోసమే పోరాటం చేస్తోందని ఖర్గే స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ తో పోరాటం చేస్తున్నామన్నారు. ఇక్కడ బీజేపీ పోటీలో లేకుండా పోయిందని సెటైర్లు వేశారు. ఎక్కడా కాషాయ పార్టీ కనిపించడం లేదన్నారు. కేసీఆర్‌కు సహకరించేందుకే బీజేపీ పోటీ నుంచి వైదొలిగిందని ఆరోపించారు. ఇలా తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తున్నాయని విమర్శించారు .ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఆ పార్టీలు శ్రమిస్తున్నాయని వివరించారు. కానీ కాంగ్రెస్ భయపడేది లేదని స్పష్టం చేశారు.
ప్రజల పోరాటం చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని ఖర్గే గుర్తు చేశారు. కానీ ఒక కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సోనియా తెలంగాణ ఇచ్చారని స్పష్టం చేశారు. కానీ ప్రజల ఆశలు నెరవేరలేదని అని ఖర్గే అన్నారు. అందుకే కాంగ్రెస్ గెలిపించాలని కోరారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.

మోదీ, కేసీఆర్ మధ్య ఒప్పందం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. మోదీ తెచ్చిన అన్ని బిల్లులకు కేసీఆర్ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను సోనియా గాంధీ టీపీసీసీ అధ్యక్షుడిగా చేశారని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తన ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానని స్పష్టం చేశారు.
2018లో కొడంగల్‌లో కేసీఆర్ తనపై కుట్రచేశారని రేవంత్ ఆరోపించారు. ఆ తర్వాత ప్రశ్నించే గొంతుకుగా మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచానని స్పష్టం చేశారు. దేశంలో అభివృద్ధి కాంగ్రెస్‌తోనే జరిగిందన్నారు.
కాళేశ్వరం పేరుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. అందువల్లే కట్టిన మూడేళ్లకే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందన్నారు. తెలివి ఉన్న ఎవరైనా ఇసుకపై కడతారా ప్రశ్నించారు. 60 ఏళ్లైనా కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ అలాగే ఉందన్నారు. వెయ్యి కోట్లతో కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు చెక్కుచెదరలేదని తెలిపారు. కేసీఆర్ దోపిడీకి మేడిగడ్డ బలైపోయిందని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయిందని రేవంత్ మండిపడ్డారు.