
Telangana Elections : వ్యాపారం, వాణిజ్యం, సినిమా, విద్య, వైద్యం, రియల్ ఎస్టేట్, రాజకీయం.. ఇలా ఏ రంగమైనా రాణించాలంటే ప్రధానంగా కావాల్సింది మార్కెటింగ్. వస్తువు ఎంత నాణ్యతగా తయారు చేశామనేకంటే ఎంత అందంగా ప్యాక్ చేశామనేదే నేటి పోటీ ప్రపంచంలో ప్రధాన సూత్రంగా మారిపోయింది. తయారీ రంగం కంటే మార్కెటింగ్ రంగానిదే డామినేషన్. ఓ వస్తువు మంచి చెడు, దాని ఫలితాలు.. ఉపయోగాలు తెలియాలంటే అందుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం ప్రధానం. సరిగ్గా రాజకీయాల్లోనూ ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. మేమే గెలుస్తామంటే.. మాదే విజయం అంటూ పార్టీలు ధీమాగా చెబుతున్నాయి. రకరకాల సర్వేలు, సొంత లెక్కలు వేసుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, గ్రౌండ్‌లో వాస్తవ పరిస్థితి ఏంటనేది మాత్రం మౌత్ పబ్లిసిటీతోనే తెలిసిపోతోంది. మరి తెలంగాణ ఎన్నికల్లో మౌత్ పబ్లిసిటీ పవర్ ఏంటో చూద్దాం…
నోటి మాట. మౌత్ టాక్. దీనికున్న పవర్ అంతాఇంతా కాదు. ఒకరి చెవిలో ఏదైనా విషయం పడిందంటే అది ఊరంతా తెలిసేందుకు పట్టుమని 10 నిమిషాలు కూడా పట్టదు. అందులోనూ నేటి డిజిటల్ యుగంలో దాని స్పీడ్ రాకెట్ కంటే వేగంగా మారిపోయింది. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు విషయం క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అయితే సోషల్ మీడియా వచ్చాక ఇందులో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోవడం కూడా సాధ్యం కావడం లేదు. నిజాల కంటే ఫేక్ ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. అయితే నోటి మాటకి ఉండే శక్తి మాత్రం ఎప్పటికీ తగ్గిపోదు. ఒకరు విన్నది.. మరొకరు చెప్పింది.. చెవులు మారకుండా.. అసలు అభిప్రాయం ఏంటి అనేది ఎవరైనా నేరుగా చెప్పగలిగేదే నోటిమాట. అందుకే దానికి అంత వ్యాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల్లోనూ చాలా మంది మౌత్ పబ్లిసిటీనే విశ్వసిస్తున్నారు. గ్రౌండ్ రియాల్టీని తెలుసుకునేందుకు నేరుగా ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో నోటిమాటతోనే అంచనా వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా మీడియా రంగం కూడా విశ్వాసం కోల్పోయిందనే టాక్ ఉంది. పార్టీల వారీగా ప్రధాన మీడియా అజెండాలు ఫాలో అవుతోందనే అపవాదు మూటగట్టుకుంది. తెలంగాణలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనేది కాదనలేని నిజం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో జనం ఎవరివైపు ఉంటున్నారనేది తెలుసుకోవడం కొంత క్లిష్టంగా మారింది. ఈ కన్ఫ్యూజన్‌కి తెరదింపి క్లారిటీ తెచ్చుకునేందుకు పరిశీలకులతో పాటు రాజకీయ పార్టీలు మౌత్ పబ్లిసిటీతో ఓటర్ల పల్స్ పసిగడుతున్నారు. రాష్ట్రంలో మెజార్టీ మీడియా అధికార పార్టీ ప్రచారానికే ఎక్కువ సమయం, స్థలం కేటాయిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత రోజూ మూడు బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ఇదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనేక కార్నర్ మీటింగ్‌లకి అటెండ్ అవుతున్నారు. అయితే రేవంత్‌రెడ్డి ప్రచారం కంటే.. కేసీఆర్ సభలకే మెజార్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా హైలైట్ చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఇతర పార్టీల ప్రచార కార్యక్రమాలకు కేటాయించే సమయం, స్థలం కూడా కుదించేశారు. ఈ పరిస్థితుల్లో గ్రౌండ్ రియాల్టీ తెలుసుకునేందుకు మౌత్ పబ్లిసిటీ ప్రధాన ఆయుధంగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా వివిధ రాజకీయ పార్టీలకి పనిచేసిన సమయంలో మీడియా కంటే మౌత్ పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతారు. మౌత్ పబ్లిసిటీ చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తుందని పీకే విశ్వాసించే వారట. 2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ తరఫున పీకే ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేశారు. అప్పట్లో పింక్ డైమండ్ మాయం, వివేకా హత్య, కోడికత్తి దాడి వంటి అంశాలను తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలచడంలో మీడియా కంటే.. మౌత్ టాక్ ద్వారా వచ్చే ప్రచారంపైనే ఎక్కువగా ఆధారపడ్డారట. అప్పట్లో అది సత్ఫలితాలను ఇచ్చిందనే చర్చ జరిగింది.
ప్రస్తుతం తెలంగాణలో ప్రజాభిప్రాయం అంతా మౌత్ టాక్ ద్వారానే వెలుగులోకి వస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, మౌత్ టాక్ విపక్షాలకు ఒకింత మేలు చేస్తున్నాయని అంటున్నారు. రచ్చబండ, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, సెలూన్‌లు, టీ స్టాల్స్, బస్సులు, రైళ్లు, కూరగాయల మార్కెట్లు, సెల్‌ఫోన్ సంభాషణలు ద్వారా జనాభిప్రాయం ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ బలమైన మాధ్యమంగా మౌత్ టాక్ మారిపోయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్‌కి అనుకూలంగా జరగడం ఆ పార్టీకి అండర్ కరెంట్‌లా పనిచేస్తోందని తేల్చారు.
మౌత్ టాక్‌లో అత్యధికంగా బీఆర్ఎస్ అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, దళిత బంధు వైఫల్యం, డబుల్ బెడ్‌రూమ్‌ల ఫెయిల్యూర్, దళితులకి 3 ఎకరాల భూమి హామీ విస్మరణపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇటీవల మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మేడిగడ్డ వ్యవహారంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదనేది కూడా మౌత్ టాక్‌లో ప్రధానంగా వినిపిస్తోంది. అంతిమంగా ఈ చర్చల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా అభిప్రాయాలు వస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో ఎవర్ని కదిలించినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అనే సమాధానం వస్తోంది. గ్రామాల్లో బీఆర్ఎస్ కేడర్ ఆధిపత్యం.. పథకాలన్నీ వాళ్ల ఖాతాల్లోకే చేరడం తదితర అంశాలు అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయనే చర్చ జరుగుతోంది.
మౌత్ టాక్ గండాన్ని అధిగార బీఆర్ఎస్ కూడా అంగీకరిస్తోంది. అయితే కాంగ్రెస్ గెలవబోతోందని చెప్పేవాళ్లు అసలు ఓట్లు వేస్తారా అంటూ గులాబీ అగ్రనేతలు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఈ మౌత్ టాక్ భయంతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అగ్రనేతలు కేటీఆర్, హరీష్‌రావు అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. అన్ని అస్త్రాలను సంధిస్తున్నారు. ప్రజల్ని గందరగోళ పరిచేలా కర్ణాటక ప్రస్తావన తెస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మౌత్ టాక్ ఒకవైపు మెజార్టీ మీడియా ఇంకోవైపు ఉన్న ప్రస్తుత తరుణంలో ఏ ఆయుధం పవర్ ఏంటనేది డిసెంబర్3న తేలిపోనుంది.
.
.
Bandi Sanjay: ప్రీతి శవానికి ట్రీట్మెంట్ చేశారు.. కవిత వాచ్‌కు ఉన్నంత విలువ కూడా లేదా?