
Neelam Madhu : బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టిక్కెట్ల మంటలు ఇంకా చల్లారలేదు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది గులాబీ పార్టీలో ముసలం మరింత ముదురుతోంది. ఎమ్మెల్యే టిక్కెట్ దక్కని నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో పార్టీకి ఒక్కొక్కరూ గుడ్ బై చెబుతున్నారు.
తాజాగా పటాన్ చెరువులో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి టిక్కెట్ దక్కడతో ఆ పార్టీకి చెందిన కీలక నేత నీలం మధు ముదిరాజ్ కారు దిగేందుకు సిద్ధమయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. నీలం మధు పటాన్ చెరువు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు.
అదే సమయంలో కాట శ్రీనివాస్ గౌడ్ కూడా పటాన్ చెరువు నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్శింహ.. కాట శ్రీనివాస్ గౌడ్ కు సీట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మరోవైపు బీఆర్ఎస్‌లో కొందరు నేతలకు బీఫామ్ గుబులు పట్టుకుంది. ఇప్పటిదాకా 109 మందికి బీఫామ్ ఇచ్చారు గులాబీ బాస్. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. తాజా సర్వేల ఆధారంగా అభ్యర్థుల మార్పుపై సీఎం నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అలంపూర్‌లో అబ్రహం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. నర్సాపూర్ నియోజకవర్గానికి కేసీఆర్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అలాగే నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన కూడా పెండింగ్‌లోనే ఉంది. దీంతో అభ్యర్థులు, ఆశావహులు అయోమయంలో ఉన్నారు. బీఫామ్ ఇచ్చిన తర్వాత మరికొందరు నేతలు బీఆర్ఎస్ కు షాకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.