
Palakurthi Politics : పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకి ఓటమి భయం పట్టుకుందా? ఆయన సభలకు కూడా జనాలు రావడం లేదా? ముఖ్యమంత్రితో నేరుగా ఇదే విషయం చెప్పారా? నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని అంగీకరించారా? కేసీఆర్ ఎన్నికల సభలో మంత్రి ఎర్రబెల్లి చేసిన విజ్ఞప్తులే ఇందుకు నిదర్శనం. ఓ మంత్రి అయిన ఎర్రబెల్లి కూడా చిన్న చిన్న విషయాలు ప్రస్తావించడం ముఖ్యమంత్రికి కూడా చిర్రెత్తేలా చేసింది. దయాకర్‌రావు పనైపోయిందని గమనించిన కేసీఆర్ అధైర్యపడకు దయాకర్ అని సముదాయించడం పాలకుర్తిలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి గట్టిగా బదులిచ్చారు. తాము దోచుకునేందుకు రాలేదని.. అమెరికాలో తమకు తరతరాలకి సరిపోను సంపద కష్టపడి సంపాదించామని ఫైరయ్యారు.
ఎన్నికల సభ అంటే.. చేసింది చెప్పడం.. మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తామో హామీలు ఇవ్వడం పరిపాటి.అందులోనూ ఎమ్మెల్యే అయితే పెద్దగా చెప్పుకునే అవకాశం ఉండదు. మరి మంత్రిగా పనిచేసిన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి బాధ్యత ఉంటుంది. నియోజకవర్గంలో పనులు చేయలేకపోతే వైఫల్యానికి బాధ్యత కూడా అతనిదే. మరి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీరు చూసి పాలకుర్తిలో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు సహా ఏ పని కూడా చేయలేకపోయానని బహిరంగంగా.. సీఎం కేసీఆర్ ముందే ప్రకటించి పరువు పోగొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా మంత్రి అయి ఉండి.. లైసెన్స్‌లు ఇప్పించానని.. ప్రైవేట్ ఉద్యోగాల కోసం కోచింగ్‌లు ఇప్పించానని ఏకరవుపెట్టారు. ఓ అడుగు ముందుకేసి ఎన్నికల సభలో వరాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తులు చేశారు. నిధులు లేక రుణమాఫీ జరగలేదని.. ఈసీని ఒప్పించైనా రుణమాఫీ చేయించే బాధ్యత తీసుకోవాలని కేసీఆర్‌కి బాధ్యతని గుర్తు చేశారు.
మంత్రి ఎర్రబెల్లి చేసిన విజ్ఞప్తులు కేసీఆర్‌కి కూడా చిర్రెత్తేలా చేశాయి. అయితే కాస్త సముదాయించుకున్న ముఖ్యమంత్రి ఎన్నికల సభ కావడం వల్ల ఇంజినీరింగ్ కాలేజీ ఉరుక్కుంటూ వస్తుందన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు సహా అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు.ఇదే సమయంలో ఎర్రబెల్లి మిగతా విషయాలని కూడా ప్రస్తావించాలంటూ పేపర్ చూపించగా.. చిన్నచిన్న విషయాలంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేయగా మంత్రి చిన్నబుచ్చుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకోకుండా మరో విషయం బయటపెట్టారు. హెలికాప్టర్ దిగిన తర్వాత జనం పెద్దగా రాలేదని.. సగం మంది సభ బయటే ఉండిపోయారని చెప్పారట. అయితే అదే విషయాన్ని చాకచక్యంగా చెప్పేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. అయితే ఎర్రబెల్లికి ఓటమి భయం పట్టుకుందని ముఖ్యమంత్రి మాటలతో క్లియర్‌గా తేలిపోయింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి గెలవబోతోందనే సంకేతాలిచ్చారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి స్ట్రాంగ్‌గా రియాక్టయ్యారు. తాము ఎవరికీ టోపీ పెట్టేవాళ్లం కాదన్నారు. తరతరాలకి సరిపోను సంపదలు తమకు ఉన్నాయన్నారు. కేవలం ప్రజలకిచ్చిన మాట కోసం మాత్రమే ఎన్నికల బరిలో నిలిచామన్నారు యశస్వినిరెడ్డి. దయాకర్‌రావు అరాచకాల నుంచి కాపాడాలని ప్రజలు కోరితేనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు.
మొత్తానికి పాలకుర్తిలో 26 ఏళ్ల యంగ్ తరంగ్ యశస్వినిరెడ్డి మంత్రి ఎర్రబెల్లికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె అత్త ఝాన్సీరెడ్డి పోటీ చేయకుండా పౌరసత్వం అడ్డంకులు క్రియేట్ చేశారు. ఆ తర్వాత యశస్వినిరెడ్డి నామినేషన్ తిరస్కరించాలంటూ ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇంతచేసినా ఆ కుటుంబం గట్టిగా ఎదురు నిలబడగా ఎర్రబెల్లిలో ఓటమి భయం కనిపిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ నేరుగా ప్రస్తావించడం హాట్‌టాపిక్ అయింది.
.
.