
Suryapet : సూర్యాపేటలో కాంగ్రెస్ టికెట్ పటేల్ రమేశ్ రెడ్డి ఆశించారు. అందుకోసం బలంగా ప్రయత్నాలు చేశారు. ఆయనదే టిక్కెట్ అనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో గురువారం నామినేషన్ కూడా వేశారు. తనకు కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తుందని నమ్మకంగా ఉన్నారు. పార్టీ బీ ఫామ్ కోసం ఎదురుచూశారు.
మరోవైపు సూర్యాపేట టిక్కెట్ కోసం సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. కానీ సూర్యాపేట టిక్కెట్ పై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచీ వ్యవహరించింది. నామినేషన్ల గడువుకు ఒక్కరోజు ముందు సూర్యాపేట అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఈ సీటు అనూహ్యంగా మాజీమంత్రి, సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.
టికెట్ రాకపోవడంతో పటేల్ రమేశ్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగం చెందారు. బోరున విలపించారు. ఆ సమయంలో రమేష్ రెడ్డి అనుచరులు భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఆందోళనకు చేపట్టారు. రమేశ్ రెడ్డి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వేల సంఖ్యలో అభిమానులు వెంటరాగా.. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు పటేల్ రమేష్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు అన్యాయం చేసినా ప్రజల అభిమానం తనకే ఉందంటున్నారు రమేష్ రెడ్డి. ప్రజల ఆశీస్సులు, అభిమానం ఉన్న స్థానికుడినైన తనను మంచి మెజార్టీతో గెలిపించడానికి సూర్యాపేట ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.
.
.