
Revanth Reddy : తెలంగాణలో కొందరు ప్రభుత్వ అధికారుల తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. సోమేష్ కుమార్ , జయేష్ రంజన్, స్మితా సభర్వాల్ బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. స్టీఫెన్ రవీంద్రను కూడా బదిలీ చేయాలని కోరారు.
రిటైర్డ్ అధికారులు కూడా బీఆర్ఎస్ కు ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. రిటైర్డ్ అయిన వారిని పదవుల్లోకి తీసుకొచ్చి విపక్షాలపై దాడులు చేసేందుకు ఉపయోగిస్తున్నారని వివరించారు. అలాంటి వారిని తొలగించాలని ఈసీని కోరామన్నారు. అక్రమ కేసులు పెట్టి విపక్షాలను వేధిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకుని లబ్ధిదారులకు మేలు జరగకుండా చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నవంబర్ 2 లోగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు వాయిదా పడితే అధికారంలోకి రాగానే పెంచిన మొత్తాలను తామే ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే పదివేల రూపాయలే వస్తాయని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటే 15 వేలు వస్తాయన్నారు.
మేడిగడ్డలో సంఘ విద్రోహశక్తులు పేలుడు పదార్థాలు పెట్టారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ విషయంలో కేసీఆర్ కామన్ సెన్స్ కోల్పోయారని విమర్శించారు. పేలుడు పదార్థాలతో పేల్చితే పిల్లర్లు గాల్లోకి లేస్తాయన్నారు. కానీ కుంగిపోవని వివరించారు. మేడిగడ్డ ప్రమాదం పూర్తిగా నాణ్యతా లోపం వల్లే జరిగిందని స్పష్టం చేశారు.