
Station Ghanpur : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళుతోంది. టీపీసీసీ చీఫ్ బహిరంగ సభల్లో పాల్గొంటూ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయ భేరి సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి , డిగ్రీ కాలేజీ నిర్మించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని రేవంత్ మండిపడ్డారు. హామీలు అమలు చేయకపోవటం వల్లే ఈ రోజు బీఆర్ఎస్ నేతలు సందు సందు తిరుగుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంలో గులాబీ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
కేసీఆర్ పాలనలో తొలి 5 ఏళ్లు మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఎనమిది మంది మహిళలకు మాత్రమే ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ 12 మంది మహిళలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దించిందని తెలిపారు. నలుగురు మహిళలకు మంత్రులు పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు.కేసీఆర్ లాంటి దోపిడి ముఖ్యమంత్రి దేశంలో లేరని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. ప్రజల కళ్లలో ఆనందం చూడాలని సోనియా రాష్ట్రం ఇచ్చారని తెలిపారు. మాట ఇచ్చి నట్టేట ముంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమని విమర్శించారు. తెలంగాణలో నిరుద్యోగులు అడవి బాట పట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. యువతకు ఉద్యోగాలు రావాలని కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చిందన్నారు. కానీ నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవళిక ఆత్మహత్యపై తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.
శిశుపాలుడి 100 తప్పుల తర్వాత శిరచ్ఛేదం జరిగిందని రేవంత్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ కూడా 100 తప్పులు చేశారని మండిపడ్డారు. అందుకే కేసీఆర్ పాలన కూడా చరమగీతం పాడాలన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను వివరించారు. స్టేషన్ ఘన్ పూర్ లో ఇందిరను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలోనూ రేవంత్ పాల్గొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఆంధ్రాలో అధికారం కోల్పోతామని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అవుతుందని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దోపిడికి గురైందని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను కొట్టించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.