
Revanth Reddy Latest News(Telangana election update):
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొండగల్ నియోజకవర్గంలో మరోసారి ప్రచారం చేపట్టారు. బొమ్రాస్ పేట్ లో నిర్వహించిన రోడ్ షో నిర్వహించారు. ఇక్కడకి భారీగా జనం పోటెత్తారు. ముఖ్యంగా మహిళలు ఘనస్వాగతం పలికారు. దీంతో బొమ్రాస్ పేట కూడలి కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది.
కొడంగల్‌ను దత్తత తీసుకుంటామని చెప్పిన నేతలు ఆ హామీ నిలబెట్టుకున్నారా ? అని రేవంత్ నిలదీశారు. నీళ్లు తీసుకొస్తామని చెప్పిన నేతలు.. ఆ హామీని నెరవేర్చారా? అని ప్రశ్నించారు. తన హయాంలోనే బొమ్రాస్ పేట్ అభివృద్ధి చెందిందన్నారు. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ పూర్తి చేస్తామన్న బీఆర్ఎస్ హామీ నెరవేరలేదని విమర్శించారు. కృష్ణా జలాలు తీసుకోస్తామని మోసం చేశారని మండిపడ్డారు. మాదనపూర్ నుంచి ఇక్కడ తండాలకు రోడ్లు వేయించింది తానేనని గుర్తు చేశారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలు కష్టాలను తాము అర్థం చేసుకున్నామని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని సంకల్పించామన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, రోడ్లు నిర్మించామని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పేదల కోసం ఏమీ చేయలేదన్నారు. ఇప్పుడొచ్చి కేసీఆర్ మళ్లీ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. మద్యం పోసి, రూ.10 వేలతో ఓటు కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రూ.లక్షల కోట్లు సంపాదించడమే బీఆర్ఎస్ నేతల లక్ష్యమని మండిపడ్డారు. బంగారు తెలంగాణలో పేదలకు కేసీఆర్ ఎంత బంగారం పంచారు? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు.. ఉన్న బంగారాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చిందని సెటైర్లు వేశారు. ప్రజలు కష్టాలు అర్థం చేసుకునే 6 గ్యారంటీలు ప్రకటించామని రేవంత్ రెడ్డి వివరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. “మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా మొదటి తారీఖు రూ.2500 ఖాతాలో వేస్తాం. రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేలు అందిస్తాం. రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు సాయం అందిస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. చేయూత పథకం ద్వారా నెలకు రూ.4వేలు పెన్షన్ ఇస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం.” అని రేవంత్ హామీ ఇచ్చారు.