
Revanth Reddy : కాంగ్రెస్ ప్రచారంలో మరింత దూకుడు పెంచింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోజూ 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. తాజాగా బెల్లంపల్లిలో కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోలేదని రేవంత్ విమర్శించారు. కాకా కుటుంబం ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను భుజాన మోస్తోందన్నారు.
బెల్లంపల్లిలో దుర్గం చెన్నయ్యను, చెన్నూరులో బాల్క సుమన్ ను ఓడించాలని రేవంత్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లిలో దుర్గం చెన్నెయ్య అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. అమ్మాయిలను ఇబ్బందులు పెట్టారని బాధితులే స్వయంగా చెప్పిన విషయాలను ప్రస్తావించారు. అలాంటి వ్యక్తిని ఓడించాలని ప్రజలను కోరారు. బెల్లంపల్లిలో గడ్డం వినోద్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. అలాగే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. బాల్క సుమన్ సింగరేణి ఉద్యోగాలు అమ్ముకోలేదా? అని ప్రశ్నించారు. చెన్నూరులో గడ్డం వివేక్ ను గెలిపించాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను రేవంత్ రెడ్డి ఎండగట్టారు. కేసీఆర్ కు ఆకలి ఎక్కువ.. ఆలోచన తక్కువ అన్నారు. దోపిడినే లక్ష్యంగా ఆయన పాలన సాగిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునాదులే సరిగ్గా లేవన్నారు. మేడిగడ్డ కుగింది.. అన్నారం పగిలిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ఇక పనికిరావన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదు.. కర్ఫ్యూలు ఉంటాయని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. 2004లోనే 9 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ అమల్లోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఉచిత కరెంట్ కు పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. అలాగే కౌలు రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
గృహవినియోగాదారులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లపై విమర్శలు చేసిన కేసీఆర్.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. కానీ ఆయన మాత్రం రూ. 250 కోట్లతో ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. కానీ పేదలకు ఇళ్లు ఇవ్వలేదన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామన్నారు. చేయూత పథకం ద్వారా పెన్షన్ ను రూ. 4000 , మహిళలకు రూ. 2500 ఆర్థికసాయం ప్రతినెలా ఒకటో తేదినే అందిస్తామని హామీఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామన్నారు.
.
.
.
amit shah : అధికారంలోకి వస్తే.. బీసీ నేతే సీఎం.. అమిత్ షా కీలక ప్రకటన..