
Revanth Reddy : రామగుండంలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. భారీగా మహిళలు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో మహిళలను చూస్తుంటే కాంగ్రెస్ విజయం సాధించినట్లే అనిపిస్తోందన్నారు. ఈ సభలో సింగరేణి కార్మికుల సమస్యలను రేవంత్ ప్రస్తావించారు.
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారని రేవంత్ గుర్తు చేశారు. బొగ్గు ఉత్పత్తి బంద్ చేసి మద్దతు తెలిపారని వివరించారు. వారి సమస్యలు తీరుస్తానని నాడు కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేరిందా? అని ప్రశ్నించారు. సింగరేణి ఎన్నికలు జరుగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. కార్మికులతో పెట్టుకుంటే గద్దెలు కూలుతాయని హెచ్చరించారు.
ఓపెన్ కాస్ట్ మైన్లను AMR కంపెనీలకు అప్పజెప్పారని రేవంత్ విమర్శించారు. రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టులు మూతపడ్డాయని తెలిపారు. సింగరేణి కష్టాలు పోవాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.ఇక్కడి ఎమ్మెల్యే సానుభూతితో గెలిపిస్తే ఉద్యోగాలు అమ్ముకున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే బందిపోటులామారి వనరులు దోస్తున్నారని ఆరోపించారు. రామగుండం ఎమ్మెల్యే కేసీఆర్ కుటుంబానికి కప్పం కడుతున్నారని ఆరోపించారు.
రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదినే తేదిన జీతాలు ఇస్తామని ప్రకటించారు. రామగుండంలో ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. చీకటిలో మగ్గుతున్న రామగుండంలో వెలుగులు విరజిమ్మేలా చేస్తామని హామీఇచ్చారు.
.
.
.