
kamareddy : సీఎం కేసీఆర్‌కు కామారెడ్డిలో కష్టకాలం తప్పట్లేదా? ముఖ్యమంత్రిపై స్వయంగా తానే పోటీ చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భావిస్తున్నారా? ఇప్పటికి రెండుసార్లు గెలిచిన గజ్వేల్‌తో పాటు ఈసారి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు కేసీఆర్. దీంతో కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగే ఆలోచనలో రేవంత్‌రెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌ని ఓడించడమే లక్ష్యంగా స్వయంగా పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇటు కాంగ్రెస్ నాయకుల్లో.. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీ చేయాలనే ఆలోచనను రేవంత్‌రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రచారం ప్రారంభించే అవకాశం ఉందని చెప్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో అన్ని అస్త్రాలు ప్రయోగించి రేవంత్‌రెడ్డిని ఓడించింది బీఆర్ఎస్. మంత్రి హరీష్‌రావుకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించి, పట్నం నరేందర్‌రెడ్డిని గెలిపించారు. అందుకు ఈ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని రేవంత్‌రెడ్డి ఆలోచనగా ప్రచారం జరుగుతోంది.
కామారెడ్డిలో కేసీఆర్‌కు ఒకదాని తర్వాత మరో షాక్ తగులుతోందా? గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి తాను బరిలోకి దిగినా.. పాత నియోజకవర్గాన్నే అట్టి పెట్టుకుంటానని.. కామారెడ్డిలో రాజీనామా చేస్తానని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీనిపై గజ్వేల్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నా.. కామారెడ్డి ప్రజలు గుస్సా అవుతున్నారు. రాజీనామా చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఎందుకు పోటీ చేయడం అనే ప్రశ్న సంధిస్తున్నారు. ఇది కేసీఆర్‌కు పెద్ద మైనస్‌గా మారిందనే చెప్పాలి. స్థానికంగా తీవ్ర వ్యతిరేకత మూట గట్టుకున్నారు. కేసీఆర్‌పై మొదలైన ఈ వ్యతిరేకత కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుందా?
మరోవైపు.. లింగాపూర్ మాస్టర్‌ప్లాన్‌లో తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్న అక్కడి రైతులు.. సీఎం కేసీఆర్‌పై పోటీకి సై అంటున్నారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రిని ఓడించి తమ సత్తా ఏంటో చూపించాలని నిర్ణయానికి వచ్చారు. దాదాపు 140 మంది రైతులు నామినేషన్లు వేయనున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగితే పోటీ ఆసక్తిగా మారనుంది.