
Revanth Reddy : ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆయన పేదలపై వరాలు జల్లు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలు, మహిళలు, రైతులు, భూమిలేని వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి అందరం రుణపడి ఉన్నామన్నారు. ఈసారి అధికారం ఇస్తే పేదలకు ఉపయోగపడే పనులు చేస్తామని హామీ ఇచ్చారు.
దౌల్తాబాద్‌లో రేవంత్‌రెడ్డి నిర్వహించిన రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ నిప్పులు చెరిగారు. ప్రజలకు పెరిగిన ఆదాయాన్ని కేసీఆర్ మద్యం ద్వారా లాగేస్తున్నారని మండిపడ్డారు. ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయని తెలిపారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఎంత మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చిందో ఆలోచించాలని రేవంత్ కోరారు. సాగుకు ఉచిత కరెంట్ తొలిసారి అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు.
మద్దూర్ లోనూ రోడ్ షోలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి రెండేళ్లలో కృష్ణా జలాలు తెస్తామని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇస్తామని మాయమాటలు చెప్పారని విమర్శించారు. ఈ ఐదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. కొడంగల్, మద్దూరుకు రైల్వే లైన్లు వచ్చాయా? అని నిలదీశారు. కొడంగల్, మద్దూరుకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వచ్చాయా? అని ప్రజల అడిగారు.
కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో వీధివీధికి బెల్టు షాపులు మాత్రం వచ్చాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నారాయణ్ పేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తికావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి నిర్వహించిన రోడ్ షోలకు జనం పోటెత్తారు. ఆయన కొండగల్ తోపాటు కామారెడ్డిని నుంచి బరిలోకి దిగారు. నామినేషన్ వేసిన రోజు కామారెడ్డి సభలో పాల్గొన్నారు. ఇప్పుడు కొండగల్ లో ప్రచారం చేపట్టారు. రేవంత్ కు తన సొంత నియోజకవర్గంలో అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.