
Revanth Reddy : 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు చరమగీతం పాడటానికి కామారెడ్డి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అక్కడ జరిగిన బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్తును కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని అన్నారు. ఇక్కడ తీర్పు కోసం దేశ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందని తెలిపారు.
కామారెడ్డి ప్రాంతంలోని రైతుల కష్టాలను రేవంత్ వివరించారు. 2015లో హైదరాబాద్ సచివాలయం ఎదురుగా కామారెడ్డికి చెందిన లింబయ్య అనే రైతు ఆత్మహత్యకు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ లింబయ్య కుటుంబ సమస్యలతో చనిపోయాడని నిందలు వేశారని మండిపడ్డారు. ఏ నాడు సచివాలయానికి కేసీఆర్ రాలేదన్నారు. గతంలో సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రులను కలిసే అవకాశం ఉండేదన్నారు. కేసీఆర్ పాలనలో సామాన్యులకు ఆ అవకాశం ఇవ్వలేదని విమర్శించారు.
కామారెడ్డి గెలుపు కోసమే కేసీఆర్ ఇప్పుడు నక్క వినయాలు నటిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తన పూర్వీకులది కోనాపూర్ గ్రామం అని చెపుకుంటున్న కేసీఆర్.. ఈ ప్రాంతంపై ప్రేముంటే కామారెడ్డి రైతులను ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని ఇప్పుడే ఎందుకు చెబుతున్నారని నిలదీశారు. రైతులు ఆందోళన చేసినప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని మండిపడ్డారు.
కేసీఆర్ గజ్వేల్ నుంచి పారిపోయి.. కామారెడ్డికి వచ్చారని రేవంత్ విమర్శలు గుప్పించారు. గజ్వేల్ ను అభివృద్ధి చేసుంటే కామారెడ్డిలో ఎందుకు పోటీ చేస్తున్నారని నిలదీశారు. బీసీ నేత గంప గోవర్ధన్ సీటు కేసీఆర్ లాక్కున్నారని ఆరోపించారు. సీఎం కన్ను కామారెడ్డి భూములపై పడిందన్నారు. అందుకే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపించారు.
40 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలను కేసీఆర్ కొన్నారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా ఇతర పార్టీల నుంచి గెలిచి నేతలను కొనేశారని విమర్శించారు. తనపై ఉన్న కేసులపై ఈడీ, సీబీఐ దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. మరి కేసీఆర్ తాను కొన్న ఎమ్మెల్యేల వ్యవహారంపై దర్యాప్తునకు సిద్ధమా అని చాలెంజ్ చేశారు. సిద్ధంగా ఉంటే దర్యాప్తు కోసం 24 గంటల్లో లేఖ రాయాలని కోరారు. లేదంటే కామారెడ్డి చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలన్నారు. కేసీఆర్ కామారెడ్డి భూములు కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. తాను ఇక్కడ ప్రజలకు అండగా ఉంటానని గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Congress Meeting Narsapur : కేసీఆర్ కుటుంబమే బంగారు పల్లెంలో తింటోంది.. బీఆర్ఎస్ పాలనపై రేవంత్ విమర్శలు..