
Revuri Prakash Reddy : తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పరకాల సెగ్మెంట్‌లో రసవత్తర పోరు నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి , బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి మధ్య పోరు ఆసక్తిగా మారింది. రేవూరి ఎంట్రీతో కారులో గుబులు మొదలైందంటున్నారు. ఇప్పటికే సెకండ్ గ్రేడ్ కేడర్ బీఆర్ఎస్‌ను వీడింది.
రేవూరి రాకతో కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు పెరిగాయి. రేవంత్ సమక్షంలో పార్టీలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు చేరారు.కేడర్ దూరమవుతుండటంతో చల్లా ధర్మారెడ్డికి ఓటమి భయం పట్టుకుందని లోకల్ టాక్. పరకాలలో కొండా మురళి దంపతుల మద్దతు తనకు బలంగా మారింది రేవూరి ప్రకాష్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్ ఇస్తామని రేవూరి స్పష్టం చేశారు. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో తన విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు.
టీడీపీ కేడర్ మద్దతు కూడా తనకే ఉందంటున్నారు రేవూరి. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ నేతలు అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. పదేళ్లపాటు ధర్మారెడ్డి అవినీతిని ప్రజలు సహించారని.. ఇప్పుడు పరకాలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్ చేతికిందే పనిచేస్తున్నారని రేవూరి ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు. అందుకే లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయడం లేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.