
Telangana Elections : తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తైంది. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. చెన్నారు నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి జి.వివేకానంద రూ.600 కోట్ల ఆస్తులతో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడుగా నిలిచారు. ఇదే పార్టీ చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.460 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. వివేక్ ,ఆయన భార్య చరఆస్తులు రూ. 377 కోట్లుగా పేర్కొన్నారు. అవి వివిధ కంపెనీల షేర్ల రూపంలో, విశాఖ ఇండస్ట్రీలో ఉన్నాయని వెల్లడించారు. ఆయన స్థిరాస్తుల విలువ రూ. 225 కోట్లుగా ప్రకటించారు.
వివేక్ దఅఫిడవిట్ లో ఆయన, భార్యకు కలిపి 41.5 కోట్లు అప్పును చూపించారు. 2022 ఆర్థికసంవత్సరంలో ఆదాయం రూ.6.26 కోట్లుగా పేర్కొన్నారు.2019 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయం రూ.4.66 కోట్లుగా చెప్పారు. ఆయన భార్య వార్షిక ఆదాయం 2019లో రూ.6.09 కోట్లుకాగా.. 2022లో రూ.9.61 కోట్లుగా పేర్కొన్నారు.
పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థిర, చరాస్తుల కలిపి రూ.460 కోట్లగా పేర్కొన్నారు. అప్పులు 44 కోట్లుగా చూపించారు.ఇటీవల పొంగులేటి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరిగాయని పొంగులేటి అన్నారు.
మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయాన్ని రూ. 71.17 కోట్లుగా అఫిడవిట్ లో చూపించారు. 2019లో ఆయన వార్షికాదాయం 36.6 లక్షలుగా ఉంది. సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ లో 1.24 కోట్లు షేర్లు ఉన్నాయని అప్పుడు పేర్కొన్నారు. ఆ షేర్ల విలువ రూ. 239 కోట్లుగా చూపించారు. తన కుటుంబ ఆస్తుల రూ.459 కోట్లుగా పేర్కొన్నారు. తన కుటుంబ స్థిరాస్తులు రూ.157 కోట్లుగా , అప్పులు రూ. 4.14 కోట్లు అని తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ ఆస్తుల విలువ రూ. 59 కోట్లు అని తెలిపారు. అప్పులు రూ.25 కోట్లు చూపించారు. తనకు సొంతకారు లేదని కూడా వెల్లడించారు. తెలంగాణలో 199 నియోజకవర్గాల్లో మొత్తం 4,798 మంది అభ్యర్థులు 5,716 సెట్ల నామినేష్లను దాఖలు చేశారు. తెలంగాణలో పోలింగ్ నవంబర్ 30న జరగనుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడతాయి.