
Telangana Elections : తెలంగాణ ఎన్నికల సమరంలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక అసలు పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ప్రచారం పర్వం పతాక స్థాయికి చేరింది. ఈ సమయంలోనే బరిలో నిలిచిన వారిలో సంపన్నులెవరు? నిరుపేదలెవరు? ఎవరిపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి? ఇలాంటి అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సంపన్నుడు గడ్డం వివేక్ కాగా..నిరుపేదగా బీజేపీ నేత బండి సంజయ్ నిలిచారు. టాప్-20లో పది మంది కాంగ్రెస్ నేతలే ఉన్నారు.
తెలంగాణలో ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థులు తమ ఆస్తులు – అప్పుల వివరాలు ప్రకటించారు. 119 నియోజకవర్గాల్లో 4వేల 798 మంది క్యాండిడేట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు.. 14 మంది వంద కోట్ల క్లబ్‌లో ఉన్నారు. వారిలో చెన్నూరు నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న గడ్డం వివేక్ 606 కోట్లతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు.పేద అభ్యర్థిగా బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ఉన్నారు. ఇక రెండో రిచెస్ట్ అభ్యర్థిగా మునుగోడు కాంగ్రెస్ క్యాండిడేట్ రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. ఆయన ఆస్తులు.. 458 కోట్ల 20 లక్షలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక మూడో స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థే ఉన్నారు. పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 433 కోట్లతో థర్డ్‌ప్లేస్‌లో ఉన్నారు.
భువనగరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పైళ్ల శేఖర్‌రెడ్డి ఆస్తులు 227 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్‌లో చూపించారు. బెల్లంపల్లి నుంచి హస్తం గుర్తుపై కంటెస్ట్ చేస్తున్న గడ్డం వినోద్ ఆస్తులు 202 కోట్లుగా లెక్కలు చూపించారు. ఆ తర్వాత ప్లేస్‌లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆయన ఆస్తులు.. 197 కోట్లు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ క్యాండిడేట్ రవికుమార్‌కు 166 కోట్లు, అక్కడి నుంచే పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ ఆస్తులు 124 కోట్లుగా అఫిడవిట్‌లో పొందుపర్చారు. నిజామాబాద్ అర్బన్ ప్రస్తుత ఎమ్మెల్యే బిగాల గణేష్‌కుమార్ గుప్తాకు 124 కోట్లు, నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డికి 112 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక కోరుట్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు 107 కోట్లు, బాల్కొండ కాంగ్రెస్ క్యాండిడేట్ సునీల్‌కుమార్‌కు 104 కోట్లు, బోధన్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 102 కోట్ల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో తెలిపారు.
ఇక నామినేషన్లు అత్యధికంగా దాఖలైన నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ టాప్ ప్లేస్లో ఉంది. ఇక్కడ 145 మంది అభ్యర్థులు 154 నామినేషన్లను దాఖలు చేయగా ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ సెగ్మెంట్ లో 116 మంది 127 నామినేషన్లను దాఖలు చేశారు. బీఆర్ఎస్ అధినేత పోటీ చేస్తున్న గజ్వేల్ సెగ్మెంట్ లోనే రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కాగా.. ఆయన పోటీ చేస్తున్నరెండో స్థానమైన కామారెడ్డిలో సైతం 92 మంది 105 నామినేషన్లను దాఖలు చేశారు. ఎల్బీనగర్, సూర్యాపేట్, మిర్యాలగూడ, పాలకుర్తి, హుజూర్‌నగర్, కరీంనగర్, హుస్నాబాద్, మల్కాజ్‌గిరి, నల్లగొండ, సిద్ధిపేట, జూబ్లీహిల్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక అత్యంత తక్కువ నామినేషన్లు నారాయణపేట నియోజకవర్గంలో 13 ఫైల్ అయ్యాయి. ఆ తర్వాత జగిత్యాల, బాన్సువాడ, నిజామాబాద్ ఉన్నాయి. మక్తల్, వైరా, బాల్కొండ నియోకవర్గాల్లోనూ ఇరవై లోపే దాఖలయ్యాయి. దాదాపు 30 నియోజకవర్గాల్లో సగటున 30 చొప్పున నామినేషన్లు దాఖలుకాగా, మరో 35 చోట్ల 40లోపు, మరో 30 సెగ్మెంట్లలో 50 చొప్పున దాఖలయ్యాయి.
ఎన్నికల అఫిడవిట్లలో కొందరు క్యాండిడేట్లు తమపై ఉన్న క్రిమినల్ హిస్టరీని దాచిపెట్టారు. బోథ్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సోయం బాపురావుపై డెకాయిట్ కేసులు ఉన్నాయి. వాటిని ఆయన అఫిడవిట్ లో పొందుపర్చలేదు. మరోవైపు రాజాసింగ్‌తోపాటు బాపురావుపై అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నాయి. దాదాపుగా పదిమందికిపైగా అభ్యర్థులు డాక్టరేట్లు పొందినవారు కూడా ఉన్నారు. వారిలో బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి, గువ్వల బాలరాజు, గాదరి కిషోర్, బాల్క సుమన్, రసమయి బాలకిషన్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సీతక్క, సంపత్ కుమార్, నీలిమ, గద్దర్ కుమార్తె వెన్నెల ఉండగా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనురాధ కూడా డాక్టరేట్ పొందినవారిలో ఉన్నారు.