
Telangana Elections : తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4,798 నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూటినీ ప్రక్రియలో 608 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో అత్యధికంగా 114 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు. అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. ఇక మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్‌లో 67 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ , టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డిలో 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో 50 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పోటీ చేస్తున్న మరొక స్థానం కొడంగల్‌లో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా నారాయణపేటలో కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత బాల్కొండ నియోజకవర్గం ఉంది. అక్కడ తొమ్మిది మంది ఎన్నికల బరిలో నిలిచారు.
నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం వరకు గడువు ఉంది. ఆ తర్వాత మొత్తం బరిలోకి దిగే అభ్యర్థులు ఎంతమందో పూర్తిగా స్పష్టత రానుంది.