
Pocharam Srinivas Reddy : స్పీకర్ అంటే ఇంటికేనా? గతంలో సభాపతిగా పనిచేసిన వాళ్లకి ఓటమి తప్పలేదా? ఇప్పుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి విషయంలోనూ ఇదే జరగనుందా? బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కి ఎదురుగాలి వీస్తోందా? 2009 నాటి ఫలితాలే పోచారం రుచి చూడబోతున్నారా? త్రిముఖ పోరులో శ్రీనివాస్‌రెడ్డికి టఫ్ ఫైట్ తప్పదా? అంటే సమాధానం అవును అనే వస్తోంది. స్పీకర్ సెంటిమెంట్‌కి తోడు నియోజకవర్గంలో వ్యతిరేకత, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కి ఎదురుగాలి వీస్తుండటం పోచారానికి పరాభవం తప్పేలా లేదనే టాక్ నుడుస్తోంది. వయసు పైబడటం.. కుమారుడి షాడో పెత్తనం.. కేడర్ అవినీతి దందాలు.. పోచారం ఓటమికి కారణం కానున్నాయని నియోజకవర్గంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ స్పీకర్లుగా పనిచేసిన నేతలు ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి చవి చూడటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇదే సీన్ తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విషయంలోనూ రిపీట్ కానుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ స్పీకర్లుగా పనిచేసిన నాయకులకు పరాభవం తప్పలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మూడు దశాబ్దాలకు పైగా స్పీకర్లుగా పని చేసిన వారు గెలిచిన దాఖలాలు లేవు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యేగా వరుసగా నాలుగు సార్లు గెలిచిన కె.ఆర్.సురేష్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో ఓటమి చెందారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి స్పీకర్‌గా పని చేసిన సిరికొండ మధుసూదనాచారికి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడు అదే పదవిలో ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపోటములపై జోరుగా చర్చ జరుగుతోంది. బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 8 సార్లు బరిలో దిగిన పోచారం.. ఏడు సార్లు గెలిచారు. 9వ సారి పోటీలో ఉండగా స్పీకర్ పదవి సంప్రదాయ సెంటిమెంట్ భయం వెంటాడుతోంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా రెండు దఫాలు అధికారంలో ఉన్న తర్వాత వరుసగా మూడోసారి మనుగడ సాధించలేదు. బీఆర్ఎస్‌పై ప్రజా వ్యతిరేకతకు తోడు సభాపతి గెలుపోటములపై ప్రభావం చూపనుందనే ప్రచారం జరుగుతోంది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేసిన 8 ఎన్నికల్లో కేవలం ఒకసారి మాత్రమే బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓటమి చెందారు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన పోచారం అప్పట్లో ఓ కుంభకోణం ఆరోపణలతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఆ ఒక్క సందర్భంలో తప్ప ఇంకెప్పుడూ ఓటమి ఎరుగని పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రస్తుతం గడ్డు పరిస్థితిలు ఎదుర్కొంటున్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో తప్ప మిగతా అంతా మైనస్ టాక్ నడుస్తోంది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎక్కువ రాబట్టారనే టాక్ ఉంది. అయితే అవన్నీ అనర్హులకే దక్కాయని జనంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
బాన్సువాడలో త్రిముఖ పోరు నెలకొనడం పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమంలో పని చేసిన ఇద్దరు సీనియర్ నాయకులు ఏనుగు రవీందర్‌రెడ్డి కాంగ్రెస్ తరపున, యెండల లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. బాన్సువాడను కంచుకోటగా మలచుకొని అప్రహతిహతంగా గెలుస్తున్న పోచారానికి ఈసారి సీనియర్ నేతల నుంచి టఫ్ ఫైట్ ఎదురవుతోంది. వయసు రిత్యా 2018 ఎన్నికల్లోనే తనకు కాకుండా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేసీఆర్ వద్ద మొరపెట్టుకున్నారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పాటు సర్వేలు చూపించి మరోసారి పోచారాన్నే బరిలో దింపారు.
ఈసారి కూడా కుమారుడికి టికెట్ ఆశించి భంగపడిన పోచారం మరోసారి పోటీలు ఉన్నారు. ఓవైపు స్పీకర్ పదవి సెంటిమెంట్ భయపెడుతుండగా ఖచ్చితంగా గెలువాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రతిపక్షాల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండటం పోచారానికి ఊపిరిసలుప నీయడంలేదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున గట్టి పోటీ ఇస్తున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు గెలిచిన యెండల లక్ష్మీనారాయణ టఫ్ ఫైట్ ఇస్తుండగా స్పీకర్ తీవ్రంగా శ్రమించాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి.
గత ఎన్నికల వరకు పోచారాన్ని ఢీకొట్టిన నాయకులంతా ద్వితీయ శ్రేణికి చెందినవారు కావడంతో విజయానికి అడ్డులేకుండా పోయింది. కానీ, ఈసారి గట్టి అభ్యర్థులు పోటీలో ఉంటగా 2009లో బాజిరెడ్డి గోవర్దన్ తరహా ఫలితాలో శ్రీనివాస్‌రెడ్డికి ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. కుమారుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించడం, స్పీకర్ కావడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం మైనస్ అవుతున్నాయి. అలాగే ప్రభుత్వ పథకాలకు కేడర్.. డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.
డబుల్ బెడ్ రూమ్, దళిత బంధు తదితర పథకాల లబ్ధిదారుల నుంచి బీఆర్ఎస్ కేడర్ డబ్బులు వసూలు చేశారనే అపవాదు ఉంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేయిస్తామనే హామీ విస్మరించడం, జకోర-చండూర్ ఎత్తిపోతల పనులు అపరిష్కృతంగా ఉండటం పోచారంపై వ్యతిరేకత పెరిగేలా చేశాయి. కాంగ్రెస్ పార్టీ వేవ్ కొనసాగుతుండగా సెటిలర్ల ఓట్లు ఇక్కడ డిసైడ్ ఫ్యాక్టర్ కానున్నాయి. అదే సమయంలో నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న సామాజిక వర్గం ఓట్లు బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా సమానంగా చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పోచారం రాజకీయ జీవితం ప్రారంభించిన తర్వాత 2009 మినహా ఎన్నడూ గట్టిపోటీని ఎదుర్కోలేదు. అన్ని ఎన్నికలు ఒకలెక్క.. ప్రస్తుత ఎన్నికలు మరోలెక్క అన్నట్లుగా పోచారం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరి స్పీకర్ సంప్రదాయాన్ని బాన్సువాడ ప్రజలు కొనసాగిస్తారా? లేదంటే గతానికి భిన్నంగా పోచారం విజయం సాధిస్తారా? అని పొలిటికిల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
.
.